
ప్రతీ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చిందంటే చాలు సరదాల సందడి మొదలవుతుంది. ఏదో ఒక అబద్దం చెప్పాలి, ఎవరో ఒకరిని ఏప్రిల్ ఫూల్ చేయాలి. అదే ఏప్రిల్ ఫూల్స్ డే (April Fools Day 2025) అది సమీప బంధువులు కావొచ్చు, స్నేహితులు, సన్నిహితులు సహోద్యోగులపై కావచ్చు ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ ఫన్నీగా ఆట పట్టిస్తారు. అలా రోజంతా జోకులు,చిలిపి పనులతో కొనసాగుతుంది. అసలు ఈ క్రేజీ ట్రెడిషన్ ఎప్పటినుంచి, ఎలా మొదలైందో తెలుసా? అసలు ఎందుకు వచ్చిందో తెలుసా? రండి తెలుసుకుందాం..
ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా వచ్చింది?
గత కొన్ని శతాబ్దాలుగా ఏప్రిల్ ఫూల్స్ డేను జరుపుకుంటున్నారు. అయితే ఖచ్చితమైన మూలం ఇప్పటికీ పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఒక సిద్ధాంతం ప్రకారం ఇది 1582 నాటిది, ఫ్రాన్స్ జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారినప్పుడు, కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి మార్చారు. ఫలితంగా, ఏప్రిల్ 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వారిని "ఏప్రిల్ ఫూల్స్" అని ఎగతాళి చేసేవారట.
చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
మరొక సిద్ధాంతం ఏప్రిల్ ఫూల్స్ డేని మార్చి 25న సైబెలే దేవత గౌరవార్థం జరుపుకునే పురాతన రోమన్ పండుగ హిలేరియాతో అనుసంధానిస్తుంది. ఈ ఉత్సవంలో ప్రజలు మారువేషాలు ధరించి తోటి పౌరులను ఎగతాళి చేసేవారు. ఇది ఆధునిక కాలపు చిలిపి పనులకు ప్రేరణనిచ్చి ఉంటుందని అంచనా. అలాగే చాలా కాలం క్రితం జెఫ్రీ చౌసర్ అనే రచయిత తన పుస్తకం ‘ది కాంటర్బరీ టేల్స్’లో ఒక జోక్ వేశారట. ఆ జోక్ ను కొంతమంది ఏప్రిల్ ఫూల్స్ డేగా పాటించడం మొదలుపెట్టారని మరికొంతమందిచరిత్రకారులు చెబుతున్న మాట. ఇంగ్లాండ్‌లో ఏప్రిల్ ఫూల్స్ డే గురించిన మొదటి లిఖిత రికార్డులు 1686 నాటివిగా భావిస్తున్నారు. జాన్ ఆబ్రే అనే రచయిత ఏప్రిల్ 1ని "మూర్ఖుల పవిత్ర దినం"గా అభివర్ణించారట. 18వ శతాబ్దం నాటికి, ఈ సంప్రదాయం బ్రిటన్ అంతటా వ్యాపించి, 19వ శతాబ్దం నాటికి ఏప్రిల్ ఫూల్స్ డే మరింత ప్రజాదరణ పొందింది. ఇక స్కాట్లాండ్‌లో, ఏప్రిల్ ఫూల్స్ డే రెండు రోజులపాటు జరుపుకుంటారు.
సరదాగానే... తేడావచ్చిందంటే..
ఏప్రిల్ ఫూల్స్ డే అనేది జీవితంలో హాస్యానికున్న ప్రాధాన్యతను గుర్తుచేసే వేడుక. ఇది ఒకర్నొకరు సరదాగా ఆటపట్టించుకోవడానికి,నవ్వుకోడానికి మాత్రమే ఉపయోగపడాలి. దైనందిన కార్యక్రమాలనుంచి కాస్తంత పక్కకు వచ్చి, కాసేపు ఉల్లాసంగా గడపడానికి మాత్రమే ఈ వేడుక. ఈ రోజు అంతా తేలికైన జోకులు పంచుకోవడం, హానిచేయని చిలిపి పనులతో అంతా సరదాగా గడిపి కొన్ని మధుర క్షణాలను పదిలపర్చుకోవడానికి మాత్రమే ఏప్రిల్ ఫూల్స్ డేని జరుపుకోవాలి. అంతే తప్ప చిలిపి పనుల పేరుతో పక్కవారికి హానిచేయడమో, సరదాల ముసుగులో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి లాంటివి చేయకూడదని గుర్తుంచుకోవాలి. లేదంటే ‘సరదా’ తీరిపోద్ది. తేడాలొచ్చాయంటే.. మాతో పెట్టుకుంటే.. మడతడిపోద్ది.. అన్నట్టు మారిపోతుంది పరిస్థితి. సో తస్మాత్ జాగ్రత్త... హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే..