
కృష్ణ పదార్థంలో క్షీణతే కారణం
వెల్లడించిన తాజా అధ్యయనం
అనంత విశ్వం మనిషికి ఎప్పుడూ మిస్టరీయే. దాని పుట్టుక, వికాసం, విస్తరణ తదితరాలు ఎప్పుడూ అబ్బురపాటు కలిగించే విషయాలే. సైంటిస్టులు ఎంతగా ప్రయత్నిస్తున్నా వాటి గుట్టుమట్లను నేటికీ విప్పలేకపోయారు. విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా అంతా విశ్వసిస్తూ వస్తున్న సిద్ధాంతం. అది తప్పని, ఇంతటి ‘అనంత’ విశ్వానికీ ఏదోనాటికి అంతం కచ్చితంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి అంటోంది! కృష్ణపదార్థంపై జరిగిన విశ్లేషణలో వెలుగులోకి వచ్చిన కొత్త వివరాల ఆధారంగా ఈ మేరకు తేల్చింది!
కృష్ణ పదార్థం ఎలాంటి మార్పుచేర్పులకూ ఆస్కారం లేకుండా స్థిరంగా ఉంటుందన్నది శాస్త్రవేత్తల భావన. అందుకే దాన్ని అంతరిక్ష స్థిరాంకమనీ అంటారు. కానీ ఆ భావన నిజం కాదని, కృష్ణపదార్థం నానాటికీ విస్తరిస్తోందని అధ్యయనంలో తేలింది! దీనిపై ఖగోళ శాస్త్రవేత్తల్లో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘విశ్వావిర్భావపు గుట్టును కనిపెట్టేందుకు, పలు అంతరిక్ష రహస్యాల చిక్కుముళ్లను విప్పేందుకు ఇది అత్యంత కీలక ఆధారం కానుంది. అంతేగాక మొత్తంగా విశ్వానికి సంబంధించి ఇప్పటిదాకా ఉన్న అవగాహననే సమూలంగా మార్చేయగలదు’’ అని వారంటున్నారు.
ఏమిటీ పదార్థం?
డార్క్ ఎనర్జీ. కృష్ణపదార్థం. అనంత విశ్వంలో మూడొంతులకు పైగా విస్తరించిన పదార్థం. అయినా ఇప్పటికీ మనిషికి అంతుచిక్కని, అతని మేధకు అందని దృగి్వషయం. దాని ఉనికి వాస్తవమే అయినా నిజానికి అదేమిటో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. విశ్వ విస్తరణను వేగవంతం చేసే శక్తిగా కృష్ణపదార్థాన్ని సైంటిస్టులు నిర్వచిస్తారు. దాని ఆనుపానులను కనిపెట్టేందుకు డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్ ఇన్‌స్ట్రుమెంట్ కొలాబరేషన్ (దేశీ) పేరుతో నాలుగేళ్ల క్రితం 900 మంది అంతర్జాతీయ స్థాయి సైంటిస్టులు బృందంగా ఏర్పడ్డారు.
అరిజోనాలోని టక్సన్ అబ్జర్వేటరీలో మేయల్ టెలిస్కోప్ తాలూకు దాని 5,000 ఫైబర్ ఆప్టిక్ లెన్సుల సాయంతో అంతరిక్షాన్ని ఆమూలాగ్రం వడపోస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా 5 వేలకు పైగా గెలాక్సీల నుంచి వెలువడే కాంతిని ఏకకాలంలో పరిశీలిస్తున్నారు. ఆ లెక్కన వచ్చే ఏడాది సర్వే పూర్తయ్యేనాటికి దేశీ ఏకంగా 5 కోట్ల గెలాక్సీల నుంచి వచ్చే కాంతిని ‘దేశీ’ లెక్కగట్టనుంది! 1,180 కోట్ల ఏళ్ల పై చిలుకు వికాస క్రమంలో విశ్వాన్ని కృష్ణపదార్థం ఎలా ప్రభావితం చేస్తూ వచ్చిందో తేల్చడమే ఈ అధ్యయన లక్ష్యం. మూడేళ్ల ‘దేశీ’ డేటాను సైంటిస్టులు తాజాగా విశ్లేషించారు.
అది అందజేసిన 1.5 కోట్ల గెలాక్సీల కాంతికి సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేశారు. ఫలితంగా ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు దేశీ సహ సారథి, డాలస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ముస్తఫా ఇషాక్ బౌషాకీ తెలిపారు. ‘‘కృష్ణపదార్థం ఎలాంటి మార్పుచేర్పులకూ లోనవదన్నది వాస్తవం కాదు. అది విస్తరిస్తోందని, అంతేగాక అప్పుడప్పుడూ అనూహ్యంగా కూడా ప్రవర్తిస్తోందని వెల్లడైంది.
ఆ క్రమంలో కృష్ణపదార్థం కొన్నిసార్లు బలహీనపడుతోంది కూడా. ఆ లెక్కన అంతిమంగా విశ్వంపై దాని ప్రభావం క్రమంగా క్షీణిస్తూ ఏదో ఒకనాటికి సున్నా అవుతుంది. మరోలా చెప్పాలంటే విశ్వ విస్తరణ వేగం క్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా నిలిచిపోతుంది. అక్కడినుంచి విశ్వం కుంచించుకుపోయే ప్రక్రియ మొదలవుతుంది. అది క్రమంగా వేగం పుంజుకుని ఒకనాటికి ఈ విశ్వపు ఉనికే లేకుండా పోతుంది’’ అని అభిప్రాయపడ్డారు. కాకపోతే ఇదంతా జరిగేందుకు కనీసం కొన్ని వందల కోట్ల ఏళ్లకు పైగా పట్టవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్