
కథలూ, నవలలూ ఆకర్షించినంత సహజంగా వ్యాసాలు పాఠకులను అలరించటం అరుదు. బ్రిటిష్ రచయిత్రి జేడీ స్మిత్ రాసిన ఆరు చిన్న వ్యాసాల నాజూకు సంపుటి ‘ఇంటిమేషన్స్’ జూలైలో విడుదలైన విశిష్ట రచన. ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా పరిస్థితుల తక్షణతే ఈ వ్యాసాల్లోని ప్రథమాకర్షణ. మనుషులనీ, ప్రపంచాన్నీ నిష్పక్షపాతంగా గమనిస్తున్న తలపోతలు, తీర్పులు కావు; ప్రవర్తకస్థాయి సమాలోచనలు. లాక్‌డౌన్‌లో అనూహ్యంగా దొరికిన సమయాన్ని రకరకాల పనులతో అందరూ నింపడాన్ని చర్చిస్తారు ‘సమ్‌థింగ్ టు డూ’ వ్యాసంలో. కానీ కాలహరణం కోసం రూపొందే కళ వేరు, అనుభూతుల్లోనుంచి సర్వోత్కృష్టమైన కళావిర్భావం జరగడం వేరు. ఆ రెండోరకానికి చెందిన సృజనకారులు అరుదు. ‘సఫరింగ్ లైక్ మెల్ గిబ్‌సన్’ ఆర్ద్రమైన వ్యాసం. మనోవేదన వ్యక్తిగతమే కాదు; వ్యక్తిస్థాయిలో అనియంత్రితం, చర్చాతీతం. లాక్‌డౌన్ సమయంలో స్నేహితులని కలవలేని బాధతో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి వేదన అలాంటిదే. ఎవరి బాధలూ వేరొకరితో పోల్చదగ్గవి కానప్పటికీ అవి మినుపుడములను ఆక్రమించి, చీకట్లను నింపకూడదని వ్యాసాంతరార్థం.
లాక్‌డౌన్ ప్రకటించేలోగా న్యూయార్క్ విడిచి లండన్ వెళ్లాలనుకుంటున్న సమయంలో రచయిత్రిని ఓచోట విరిసిన తులిప్ పువ్వులు ఆపేస్తాయి. ఫలదీకరణని స్ఫురింపచేసిన ఆ మొక్కలూ పూలూ ఆమెకు అస్తిత్వంతో చేసిన స్వీయపోరాటాన్ని గుర్తుచేస్తాయి. శరీరంలో కలిగే మార్పులు, సామాజిక నిబంధనలు– రెండింటీకీ స్త్రీ బందీయే. మగవాడిలా కాకుండా బాహ్యాంతర ప్రభావాలకి ఆమె అస్తిత్వం– వివాహిత, అవివాహిత, తల్లి, గొడ్రాలుగా రూపాంతరం చెందుతుంటుంది. స్వీయనియంత్రణాపేక్షతో జీవితాన్ని నిర్దేశించుకోవాలనుకునే రచయిత్రిని తాను రాస్తున్న, జీవిస్తున్న విలువల మధ్య అంతరాలు కలవరపెడుతుంటాయి. నిజానికి, చుట్టూ వినిపిస్తున్న మానవవేదన ముందు ఇలాంటి భావసంఘర్షణలన్నీ అర్థరహితాలే అంటారు ‘పియొనీస్’ వ్యాసంలో. ‘‘చావు ఇంతలా సాధారణం కాని పాతకాలం తిరిగొస్తే బావుండు. అప్పటి జీవితమూ, దేశ ఆర్థికపరిస్థితి బావుండేవి,’’ అన్న ట్రంప్ మాటలలోని మొదటిభాగంతో మాత్రమే ఏకీభవిస్తానంటూ మొదలవుతుంది ‘ద అమెరికన్ ఎక్స్‌పెక్టేషన్’ వ్యాసం. ఈ ‘శోకభీకర తిమిరంపు’ మరణాల్లోనూ అసమానతలున్నాయి. వైద్యవిధానాలు జనబాహుళ్యానికి సమరీతిలో అందడంలేదు. ఇన్నిరకాలైన జీవనపోరాటాల అనంతరం ప్రజల ఆంతర్యాలు మునుపటిలా ఉండవు; జీవితానికి అవసరమైనదేదో అవగతమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా మాయాజాలాలు చేస్తున్న పాలకులను గమనించే ప్రజలు చూసినదాన్ని మర్చిపోతారనీ, నూతనాధ్యాయాల్లోకి ఆ పాలకులనే పునఃస్వాగతిస్తారనీ అనుకోలేం.
‘స్క్రీన్‌గ్రాబ్స్’ వ్యాసం నిజానికి వ్యాసమాలిక. చిరువ్యాపారుల నిస్సహాయమైన ఇక్కట్లు ఒకదాంట్లో ప్రతిఫలిస్తే, కరోనా నుంచి దూరంగా తొలగిపోతున్నవారిని చూసి ఏమీలేని అభాగ్యుడు ‘‘నేనిక్కడనుంచి పారిపోను, నేనింతకంటే దారుణమైన జీవితాన్నే చూశాను,’’ అని బిగ్గరగా నవ్వడం మరో జీవనచిత్రం. విద్యార్థుల భవిష్యత్తు తాత్కాలికంగా స్తంభించిపోవడం మరో ప్రస్తావన. చివరన వచ్చే ‘పోస్ట్‌స్క్రిప్ట్’ వ్యాసం– శ్వేతజాతీయుల్లో కరోనాకంటే భయంకరంగా జీర్ణించుకుపోయిన జాతివిద్వేషం ‘కంటెప్ట్ యాజ్ ఎ వైరస్’ గురించి. నల్లజాతి ఉనికినే గుర్తించడానికి ఇష్టపడనంత, శ్వాస ఆగిపోయేదాకా మెడపై బూటుకాలు తొక్కిపెట్టగలిగేంత జాతివిద్వేషం. పేదరికంలో, చాలీచాలని వేతనాలమధ్య, వైద్యసౌకర్యాలు అందక వ్యాధుల బారిన పడితే, వారిని జుగుప్సతో వ్యాధివ్యాప్తిదారులుగా చూడటం సబబేనా? వీరి జీవితాల్లో ఇప్పుడేకాదు, ఎప్పుడూ ఐసోలేషనే అంటారు స్మిత్. రాజ్యం బలమంతా అస్తిత్వాల వెతుకులాటలో సమూహాలుగా చీలి బలహీనపడ్డ ప్రజలే! ఏదోనాటికి ఈ జాతివిద్వేష వైరస్‌కి వ్యాక్సిన్ వస్తుందన్న ఆశ మృగ్యమైపోతోంది.
చివరివ్యాసం ‘డెట్స్ అండ్ లెసన్స్’ రచయిత్రి జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులను, వారినుంచి నేర్చుకున్న విలువలనూ హృద్యంగా పరిచయం చేస్తుంది. ముగింపుగా రచయిత్రి మాటలు: ‘‘నేనెప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో అలాగే పుట్టాను– ఒక చారిత్రక ఘట్టంలో భాగాన్నై. నా శారీరక, మానసిక బలాలకిది పరీక్షాకాలం.’’ వ్యాసాలన్నీ స్వకీయ స్వగతాలైనప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోగల నిజాయితీ, విషయంలో గంభీరతా, వచనంలో సారళ్యతా, విరళంగా ఉటంకించిన వాస్తవ సంఘటనలూ రచయిత్రి చెప్పదలుచుకున్న విషయాన్ని సునాయాసంగా ఆవిష్కరించాయి. అమెరికన్ సందర్భానికి రాసిన వ్యాసాలే అయినా, చర్చించిన సమస్యలు మాత్రం మనందరివీ.
పద్మప్రియ
పుస్తకం: ఇంటిమేషన్స్
రచన: జేడీ స్మిత్
ప్రచురణ: పెంగ్విన్ బుక్స్; 2020