వెండితెరకు మిస్టర్‌ భారత్‌ | Legendary Actor Manoj Kumar Passed Away | Sakshi
Sakshi News home page

Manoj Kumar: వెండితెరకు మిస్టర్‌ భారత్‌

Published Sat, Apr 5 2025 5:48 AM | Last Updated on Sat, Apr 5 2025 11:32 AM

Legendary Actor Manoj Kumar Passed Away

నివాళి: మనోజ్‌ కుమార్‌ (1937–2025)

‘ఈ దేశం నీకేమిచ్చిందనేది కాదు... 
ఈ దేశానికి నువ్వేమిచ్చావ్‌ అనేది చూడాలి’ అన్నారు నెహ్రూ. 
‘జై జవాన్  జై కిసాన్ ’ అన్నారు లాల్‌బహదూర్‌ శాస్త్రి. 
ఈ దేశానికి ప్రధానులైన వారు ప్రజలను దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటగా అందుకున్న హీరో మనోజ్‌ కుమార్‌ (Manoj Kumar). సినిమాల్లో తన పాత్రకు ‘భారత్‌’ అని పేరు పెట్టుకుని అందరి చేత ‘మిస్టర్‌ భారత్‌’ అనిపించుకున్నాడు. శుక్రవారం మరణించిన ఈ దేశభక్త నటుడికి నివాళి

1974.
‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ రిలీజైంది. జనం మొదటిరోజు మొదటి ఆటకు వెళ్లారు. ఫస్ట్‌సీన్‌... జేబులో డిగ్రీ పెట్టుకుని రోడ్ల మీద బేకార్‌గా తిరుగుతున్న హీరో ఒకచోట ఆగిపోయాడు. కారణం... పోలీస్‌ ఒకతనిపై తుపాకీ ఎక్కుపెట్టి ‘చెప్పు... ఎవరు నువ్వు’ అని అడుగుతున్నాడు. ‘నేనా... ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ని’... ‘ఏం దొంగిలించుకుని వెళుతున్నావ్‌?’ ‘చూస్తావా...’ కోటు చాటున ఉన్న వస్తువు చూపించాడు.  రొట్టె ముక్క.

ఈ సీన్‌తోనే ఆనాటికి దేశంలో పేరుకొని పోయిన ఆకలిని, నిరుద్యోగాన్ని చూపించి ప్రేక్షకుల గుండెలను గట్టిగా చరుస్తాడు మనోజ్‌ కుమార్‌. ఆ తర్వాతి సీను కప్పుకోవడానికి గుడ్డలేని పేద స్త్రీలు... నిలువ నీడలేని నిరుపేద కూలివాళ్లు. దర్శకుడు తీసిన కథ తమ కష్టాల గురించే అని జనం అర్థం చేసుకున్నారు. సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.

‘సినిమా అనేది సందేశాలివ్వడానికి కాదు అని కొందరు అంటారు... అనుకుంటారు. కాని నేను తీసేది మాత్రం ఏదో ఒక సందేశం (Message) ఇవ్వడానికి. సమాజం నుంచి ఎంతో పొందాం... బదులుగా మంచి మాట చెప్పడానికి ఏమిటి కష్టం’ అంటాడు మనోజ్‌ కుమార్‌.

బాధ చూసినవాడు బహుశా బాధ్యతగా ఉంటాడు. పదేళ్ల వయసులో ఉండగా దేశ విభజన చూశాడు మనోజ్‌ కుమార్‌. నేటి పాకిస్తాన్‌లో ఉన్నా అబ్తాబాద్‌ నుంచి అతడి కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. రెఫ్యూజీ క్యాంప్‌లో ఉంటూ చదువుకున్నాడు. ఆ కష్టాలను మర్చిపోవడానికి అప్పుడప్పుడు మేనమామ వచ్చి సినిమాకు తీసుకెళ్లేవాడు. పన్నెండేళ్ల మనోజ్‌ చూసిన మొదటి సినిమా ‘జుగ్ను’. ఇందులో దిలీప్‌ కుమార్‌ హీరో. సినిమా చివరలో చనిపోతాడు. తర్వాత మనోజ్‌ మరో సినిమా చూశాడు. ‘షహీద్‌’. ఇందులో కూడా దిలీప్‌ కుమార్‌ హీరో. సినిమాలో చనిపోతాడు. 

మనోజ్‌ చాలా విస్మయం చెంది ఇంటికొచ్చి తల్లిని అడిగాడు ‘అమ్మా.. ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు?’. ‘ఒకసారే’. ‘మరి రెండుసార్లు చనిపోతే?’... ‘అలాంటి వాళ్లు దేవదూతలై ఉంటారు’ అంది. ‘అంటే సినిమా హీరోకు మరణం లేదన్నమాట. నేను హీరోను అవుతాను. దిలీప్‌ కుమార్‌లాంటి హీరో’ అనుకున్నాడు మనోజ్‌ కుమార్‌. అంతే కాదు దిలీప్‌ కుమార్‌ నటించిన ‘షబ్నమ్‌’ చూసి అందులో దిలీప్‌ పేరు ‘మనోజ్‌’ అని ఉంటే ‘నేను పెద్దయ్యి హీరో అయ్యాక ఆ పేరే పెట్టుకుంటాను’ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే హీరో అయ్యాడు. అదే పేరుతో విఖ్యాతం అయ్యాడు. ఎంతగా అంటే అతని అసలు పేరు హరికిషన్‌ గిరి గోస్వామి (Harikrishna Giri Goswami) అని ఎవరికీ తెలియనంత!

ఢిల్లీ నుంచి బాంబే వచ్చి సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు మనోజ్‌ కుమార్‌. వాళ్ల నాన్న కవి. ఇతనికి కూడా రాయడం వచ్చింది. కొన్నాళ్లు ఘోస్ట్‌ రైటర్‌గా పని చేశాడు. సినిమాల్లో ‘ఎక్స్‌ట్రా’గా కూడా కనిపించాడు. దిలీప్‌ కుమార్‌ను ఇమిటేట్‌ చేస్తూ ఇతను చేస్తున్న నటన ఖరీదైన దిలీప్‌ కుమార్‌ను బుక్‌ చేసుకోలేకపోయేవారిని ఆకర్షించింది. మెల్లగా అవకాశాలు వచ్చాయి. 1960లో వచ్చిన ‘కాంచ్‌ కీ గుడియా’తో తొలిసారి హీరోగా కనిపించాడు. సినిమా ఫ్లాప్‌ అయ్యింది. 

మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్‌ అయ్యాయి. అదే సమయంలో హీరో అవకాశాలు పొందడానికి డింకీలు కొడుతున్న ధర్మేంద్ర, శశి కపూర్‌లతో దోస్తీ కట్టి ఎక్కే స్టూడియో దిగే స్టూడియోగా ఉండేవాడు. ముగ్గురి జాతకం బాగుంది... ముగ్గురూ పెద్ద హీరోలయ్యారు. కాని మిగిలిన ఇద్దరి కంటే మనోజ్‌ ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శించాడు. నటుడు, రచయిత, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు... అన్నింటికి మించి దేశభక్తి అనే అంశాన్ని సినిమాకు ఫార్ములాగా మార్చగలిగిన మేధావి అయ్యాడు.

పెద్ద హీరోల రొమాంటిక్‌ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో డాన్స్‌ ఏ మాత్రం చేయలేని, లిమిటెడ్‌ బాడీ లాంగ్వేజ్‌ ఉన్న మనోజ్‌ కుమార్‌ సీరియస్‌ సబ్జెక్ట్స్‌ తనను గట్టెక్కిస్తాయని భావించాడు. భగత్‌సింగ్‌లాంటి కేరెక్టర్‌ తన ఇమేజ్‌ను పెంచుతుందని ఆ సినిమా చేయాలనుకున్నాడు. కాని భగత్‌ సింగ్‌కు సంబంధించి సినిమా తీసేంత సమాచారం ఆ రోజుల్లో లేదు. మనోజ్‌ కుమారే నాలుగేళ్లు తిరిగి సమాచారం సేకరించి కథ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

 1965లో వచ్చిన ‘షహీద్‌’... భగత్‌ సింగ్‌ మీద వచ్చిన తొలి భారతీయ సినిమా. పెద్ద హిట్‌ అయ్యింది. అంతేకాదు ‘నర్గిస్‌దత్‌ జాతీయ పురస్కారం’ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు నాటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి  సినిమాను చూశారు. మరుసటిరోజు టీకి ఆహ్వానించి మనోజ్‌తో ‘నేను జై జవాన్‌ జై కిసాన్‌ నినాదం ఇచ్చాను కదా. నువ్వు ఆ నినాదం పై సినిమా తీయరాదూ’ అని అడిగారు. దేశ ప్రధాని కోరిన కోరిక మనోజ్‌ను సూటిగా తాకింది. 

ఒక నోట్‌బుక్, పెన్ను పట్టుకుని ఢిల్లీలో రైలెక్కి ముంబైలో దిగేలోపు ‘ఉప్‌కార్‌’ స్క్రిప్ట్‌ రాశాడు. దర్శకుడు కావాలనే కోరిక అప్పటి వరకూ మనోజ్‌కు లేదు. కాని ప్రధానిని ఇంప్రెస్‌ చేసేలా సినిమా తీయాలంటే తానే దర్శకుడిగా మారక తప్పదు అనుకున్నాడు. అంటే ఒక ప్రధాని వల్ల దర్శకుడైన ఏకైన వ్యక్తి మనోజ్‌. భారతదేశంలో రైతుకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనికులకు బాసటగా నిలవాలని మనోజ్‌ తీసిన ‘ఉప్‌కార్‌’ అతణ్ణి అంబరంలో కూచోబెట్టింది. అవార్డుల రాసి పోసింది. ‘మేరే దేశ్‌ కీ ధర్తీ’ పాట జనాన్ని ఊపేసింది. సినిమాలో పాత్రకు పెట్టిన పేరు భారత్‌ (Bharat) మనోజ్‌ కుమార్‌ నిక్‌నేమ్‌ అయ్యింది. ‘మిస్టర్‌ భారత్‌’.

పాశ్చాత్య సంస్కృతి చెడ్డది కాకపోయినా దానిని చెడ్డగా ఇమిటేట్‌ చేస్తున్న వారిపై ‘పూరబ్‌ ఔర్‌ పశ్చిమ్‌’ తీశాడు మనోజ్‌. మన సంస్కృతి మనకు ముఖ్యం అని చాటాడు. ఇక దేశంలో నిరుద్యోగం, యువకుల్లో పేరుకుపోతున్న అనిశ్చితి పై ‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ తీశాడు. నేటికీ ప్రభుత్వాలు ఈ మూడూ అందించడానికి ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. ఇక బ్రిటిష్‌ వారు ఆక్రమించుకున్న చిన్న సంస్థానాల నుంచి వారిపై సాయుధ పోరాటం చేసిన వారి కథతో తీసిన భారీ చిత్రం ‘క్రాంతి’ సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యి భాష తెలియని ప్రాంతాల్లో కూడా పెద్ద కలెక్షన్లు రాబట్టింది. కార్మికుల సమస్యలతో ‘షోర్‌’ తీశాడు. చిరుద్యోగుల తరఫున ‘క్లర్క్‌’ తీశాడు. 

ఆకాంక్షలో స్వచ్ఛత, ప్రయత్నంలో శ్రమ ఉంటే విజయం వరిస్తుందనడానికి మనోజ్‌ కుమార్‌ జీవితం ఒక ఉదాహరణ. ఏ హీరోని అయితే చూసి హీరో అయ్యాడో ఆ దిలీప్‌ కుమార్‌తో ‘ఆద్మీ’లో నటించగలిగాడు మనోజ్‌ కుమార్‌. అదే దిలీప్‌ కుమార్‌ను డైరెక్ట్‌ చేసి ‘క్రాంతి’గా సూపర్‌హిట్‌ సాధించగలిగాడు. తగిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వలేక ముఖాన్ని చేతుల్లో దాచుకునే మేనరిజంతో ఫేమస్‌ అయిన మనోజ్‌ను అప్పుడప్పుడు కళాకారులు అదే మేనరిజంతో ఆటపట్టించడం కద్దు. షారూక్‌ ఖాన్‌ ‘ఓమ్‌ శాంతి ఓమ్‌’లో మనోజ్‌ను ఇమిటేట్‌ చేసి ఆయనకు కోపం తెప్పించాడు. పరువు నష్టం దావా వేసే వరకూ వ్యవహారం వెళ్లి తర్వాత సద్దుమణిగింది.

చ‌ద‌వండి: అస‌హ్యించుకుంటూనే.. చివ‌రికి న‌టిన‌య్యా

మనోజ్‌ కుమార్‌ నిజమైన దేశ ప్రేమికుడు. తన సినిమాల్లో అన్ని మతాల, వర్గాల వారి పాత్రలు సృష్టించి దేశమంటే మనుషులోయ్‌ అని చూపించినవాడు. నేటి హేట్‌ ఫిల్మ్స్‌ మధ్యలో మనోజ్‌ భావధార వెనుకబడ్డట్టు అనిపించిన అంతిమంగా గెలవబోయేది అదే. ఎందుకంటే విలువల వరుసలో మానవత్వం ముందు ఉండి తర్వాతే కదా మతం ఉండేది. సెల్యూట్‌ మిస్టర్‌ భారత్‌.

హోమియోపతి డాక్టర్‌
మనోజ్‌ కుమార్‌ మంచి హోమియోపతి డాక్టర్‌. అతనికి ఒకసారి చెంప మీద సర్పి వచ్చింది. అల్లోపతిలో ఎన్ని వైద్యాలు చేసినా పని చేయలేదు. నటుడికి ముఖాన సర్పి చాలా ప్రమాదం. ఆ సమయంలో మద్రాసులో షూటింగ్‌లో ఉండగా హోమియోపతిప్రాక్టీసు చేసే నటుడు అశోక్‌ కుమార్‌ (Ashok Kumar) ఒక డోస్‌ మందు వేశాడు. వారంలో సర్పి మాయమైంది. మనోజ్‌కు ఇది ఎంతగా ఆసక్తి రేపిందంటే అతడు హోమియోపతి డాక్టర్ల కంటే  ఎక్కువగా హోమియోపతి (Homeopathy) చదివి ఆ వైద్యం ప్రాక్టీసు చేయడానికి సర్టిఫికెట్‌ పొందాడు. చాలామందికి హోమియోపతి వైద్యం చేశాడు.

తెలుగు సినిమాల్లో మనోజ్‌ కుమార్‌
మనోజ్‌ కుమార్‌ తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా తెలుగు సినిమాల్లో ఉన్నాడు. ఆయన తీసిన ‘ఉప్‌కార్‌’ తెలుగులో కృష్ణ హీరోగా ‘పాడిపంటలు’గా రీమేక్‌ అయ్యి హిట్‌ అయ్యింది.  మరో సూపర్‌హిట్‌ ‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ తెలుగులో శోభన్‌ బాబు హీరోగా ‘జీవన పోరాటం’ పేరుతో రీమేక్‌ అయ్యింది. హిందీలో అమితాబ్‌ వేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్‌ చేశాడు. మనోజ్‌ కుమార్‌ నటించిన ‘ఓ కౌన్‌ థీ’ తెలుగులో జగ్గయ్య, జయలలిత కాంబినేషన్‌లో ‘ఆమె ఎవరు’గా వచ్చింది. ‘హిమాలయ్‌ కీ గోద్‌ మే’ శోభన్‌ బాబు హీరోగా ‘డాక్టర్‌ బాబు’గా వచ్చింది. ‘దస్‌ నంబరీ’ పెద్ద హిట్‌ కావడంతో ఎన్టీఆర్‌ (NTR) హీరోగా ‘కేడీ నంబర్‌ 1’ పేరుతో రీమేక్‌ చేశారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మగ మహారాజు’ సినిమాలో ఏడు రోజులు సైకిల్‌ తొక్కే సన్నివేశం ఒరిజినల్‌ మనోజ్‌ కుమార్‌ నటించిన ‘షోర్‌’లో ఉంది.

మనోజ్‌ కుమార్‌ కన్నుమూత
సుప్రసిద్ధ సినీనటుడు, దర్శకుడు మనోజ్‌ కుమార్‌ (87) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా వెన్నునొప్పితోనూ, వయసు సంబంధమైన ఇతర రుగ్మతలతోనూ బాధపడుతున్న మనోజ్‌కుమార్‌ ముంబైలోని కోకిలా బెన్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. కునాల్, విశాల్‌. వీరిలో కునాల్‌ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. దేశభక్తి సినిమాలతో ఖ్యాతి పొందిన మనోజ్‌కుమార్‌ను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు వరించాయి. షహీద్, ఉప్‌కార్, పూరబ్‌ ఔర్‌ పశ్చిమ్, క్రాంతి తదితర సూపర్‌హిట్‌ సినిమాలు మనోజ్‌ దర్శకత్వంలో రూపొందాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement