AP Senior Journalist Krishna Rao Passed Away - Sakshi
Sakshi News home page

సీనియర్‌ జర్నలిస్ట్‌ ‘బాబాయ్‌’ కృష్ణారావు కన్నుమూత

Published Thu, Aug 17 2023 12:53 PM | Last Updated on Thu, Aug 17 2023 5:44 PM

AP Senior Journalist Krishna Rao Passed Away - Sakshi

సాక్షి, అమరావతి: సీనియర్‌ జర్నలిస్ట్‌ సీహెచ్‌వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు గురువారం కన్నుమూశారు. కాగా, అనలిస్ట్‌గా నిక్కచ్చిగా వ్యవహరించారు కృష్ణారావు. ఆయన రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్‌’గా సుపరిచితులు. 

చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు 1959లో ఏలూరు జన్మించారు. 1975లో ఒక స్ట్రింగ‌ర్‌గా నిరాడంబ‌ర‌మైన త‌న జ‌ర్న‌లిజం ప్ర‌స్థానాన్ని ప్రారంభించి.. త‌న ప్ర‌తిభ‌తో అతి త‌క్కువ కాలంలో ఉన్న‌త‌స్థాయికి ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్‌, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ సహా ఆయ‌న ప‌లు తెలుగు, తెలుగు దిన‌ప‌త్రిక‌ల్లో ప‌నిచేసి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నారు. డెక్కన్ క్రానికల్‌లో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం ప్ర‌యాణం సాగించారు.  ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

సీఎం జగన్‌ సంతాపం
సీహెచ్‌వీఎం కృష్ణారావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.  ‘ తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారు. కిందిస్థాయి నుండి మంచి జర్నలిస్టుగా ఉన్నతస్థాయికి ఎదిగిన  వ్యక్తి కృష్ణారావు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్‌ సంతాపం తెలిపారు.

ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌.. కృష్ణారావు మృతికి సంతాపం తెలిపారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని సీఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,  వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

► సన్నిహితులు ప్రేమగా ‘బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు కృష్ణారావుమృతి బాధాకరం. కృష్ణారావు 47 ఏళ్లుగా పత్రిక రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి, జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 
  -  తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు.

► ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రగాఢ సానుభూతి
ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సిహెచ్ విఎం కృష్ణారావు గారి మృతి పట్ల  ఏపీ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ దాదాపు 5 దశాబ్దాలుగా పత్రిక రంగంలో, రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు. 18 ఏళ్ల పాటు డెక్కన్ క్రానికల్ దిన పత్రికలో బ్యూరో చీఫ్ గా ఆయన సేవలు ఎనలేనివి.. ఆయన ప్రతిభ అసామాన్యమైనది’ అని తన సానుభూతి తెలిపారు. ప్రత్యేకంగా టీవీ డిబేట్లలో నిర్మాణాత్మక రాజకీయ విశ్లేషణలు చేయడంలో ఆయనకు ఆయనే సాటని,  ఎందరో యువ జర్నలిస్టులకు కృష్ణారావు జీవితం ఆదర్శణీయమన్నారు. 

కృష్ణారావు మరణం అత్యంత బాధాకరం. తెలుగు రాష్ట్రాలలో కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా వారికున్న అవగాహన , పలు అంశాల్లో వారు  చర్చలలో పాల్గోన్న తీరు, పలు అంశాల్లో విశ్లేషణలు,  టీవీ చర్చలు  వారి అభిప్రాయాలు అద్భుతం .  నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా
:::ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్దన్‌రెడ్డి

► ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు గా కృష్ణారావు సేవలు చిరస్మరణీయం. రాజకీయ, సామాజిక అంశాలపై  ఎంతో అవగాహనతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణారావు చేసిన విశ్లేషణలు,  టీవీ మాద్యమాల్లో జరిపిన చర్చలు ఎంతో ప్రేరణ కలిగించాయి. నిరాడంబరంగా, నిజాయితీగా  సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు సాగించిన పాత్రికేయ జీవితం ఎంతో ఆదర్శప్రాయం. నాకు ఎంతో కాలంగా అత్యంత సన్నిహితుడైన జర్నలిస్ట్ సోదరుడు కృష్ణారావు మరణం నన్ను కలిచివేసింది. ఆయన మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,  వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను.
:::మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంతాపం

► పాత్రికేయ రంగంలో నేల కొరిగిన ధృవతార. సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు ఇక లేరన్న  విషయం అత్యంత బాధాకరం .సిహెచ్ ఎం వి కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా  పలు అంశాల్లో  విశ్లేషణలు,  టీవీ చర్చల్లో నిష్పక్షపాతంగా ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు అద్భుతం .   పాత్రికేయు రంగం లో నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను .

::: శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు

ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement