
నైమిశారణ్యంలో ఒక రోజు వీరభద్రుడి విజయగాథను మునులతో వాయు దేవుడు కథగా చెబుతూ శంకరుని గురించి అద్భుతంగా చెప్పాడు: సృష్ట్యాదికి సంబంధించిన కాలం గడుస్తున్న రోజులలో, చంద్ర విభూషణుడైన ఉమా మహేశ్వరుడు సతీసమేతంగా రజతా చలంపై కొలువుతీరి ఉండగా... హరుడికి తమ కార్యకలాపాలన్నిటినీ విన్నవించుకోవాలన్న కోరికతో, ఒకనాడు సకల దేవతలు, ముని గణాలు, గంధర్వాధిపులతో కూడి రజతగిరికి ప్రయాణం కట్టారు. నాలుగు వేదములు కూడా అలా ప్రయాణం కట్టిన వారిలో భాగంగా ఉన్నాయి. ఆ సంగతిని ‘వీరభద్ర విజయం’ ప్రథమా శ్వాసంలోని ఈ క్రింది పద్యంలో అక్షరరమ్యంగా చెప్పాడు పోతన.
కం. చదువులు పెక్కులుగల వా
చదువులకును మొదలు నాల్గుచదువులు గలవా
చదువులకు మొదలుగలిగిన
చదువులు గల శంభుగొలువ వచ్చెన్.
‘చదువులు’ అనగా లోకంలో మనుషులు సుఖంగాను, సౌకర్యవంతంగాను జీవనం సాగించడానికి తప్పనిసరిగా ‘నేర్వదగిన విద్యలు, నేర్వ వలసిన విద్యలు’ చాలా ఉన్నాయి. ‘ఆ చదువులకు’– అనగా అలా ‘లోకంలో మనిషి నేర్వవలసిన విద్య లన్నిటికీ’ ఆధారమైనట్టివి, లోకంలోని విద్యలన్నిటికంటే మొదటివి అని చెప్పవలసిన ‘నాల్గు చదువులు’ – అనగా ‘నాలుగు వేదములు’ ఉన్నాయి.
అయితే ఆ నాలుగు వేదములకు కూడా ముందుది, మూల మైనటువంటివి అని చెప్పదగిన చదువులను – అనగా అన్నిటి కంటె పరమమైనదిగా భావించబడే ఆదిమ జ్ఞానాన్ని – తనలో నిక్షిప్తం చేసు కుని ఉన్న ఆ శంభునిదర్శనం చేసుకుని కొలవడానికి, భక్తితో పూజించ డానికి, అందరితో కలిసి ‘నాలుగు వేదములు’ కూడా వచ్చాయి అని పై పద్యంలో భావయుక్తంగా చెప్పాడు పోతన. పరమ శివుడిని గురించిన పూర్తి జ్ఞానం కలిగి వుండడం అంటే వేదాలలో చెప్పబడిన విషయాలకు మూలమైన జ్ఞానాన్ని కలిగి ఉండడంతో సమానమని ఇందులో సూచించబడింది.
– భట్టు వెంకటరావు