
ఈద్ (Eid-ul-Fitr 2025) అంటే పండుగ, ఫిత్ర్ అంటే దానం... వెరసి దానధర్మాల పండుగ అని అర్థం. అందుకే రమజాన్ నెలలో ముస్లిం సోదరులు దానధర్మాలు అధికంగా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. సదఖా, ఖైరాత్, జకాత్, ఫిత్రా... వంటి పేర్లతో పేదసాదలకు ఎంతో కొంత సహాయం చెయ్యాలని తద్వారా దైవ ప్రసన్నత పొందాలని ప్రయత్నిస్తుంటారు.
ఇస్లాం ధర్మంలో దాతృత్వానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా రమజాన్‌లో దానధర్మాలు చేసే వారికి, స్వీకరించే వారికి కూడా మంచి ప్రతిఫలం లభిస్తుందని నమ్మకం. నిజానికి రమజాన్ అన్నది సంవ త్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమెన పవిత్ర ఖురాన్ రమజాన్ లోనే అవతరించింది. అందుకే ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ఈ మాసా నికి ప్రాప్త మయ్యాయి. మానవుల శారీరక, మాన సిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాస వ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయ భక్తులు జనింప జేసి, మానవీయ విలువలను పెంపొందిస్తుంది. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు.
ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటు చేసిన విశ్వ ప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ నెల మొదటి తేదీన ముగింపు ఉత్సవంగా ‘ఈద్’ జరుపుకొంటారు. ఈరోజు దైవం తన భక్తులకు నెలరోజుల సత్కార్యాలకు అనంతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఈద్ దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇక ముందు తప్పులు చేయ మని, సత్యంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకొనే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపునకు మరలాలి.
– మదీహా అర్జుమంద్
(ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సందర్భంగా...)