
రామ నామ జపముచే మున్ను వాల్మీకి, / బోయడయ్యు బాపడయ్యే! / కులము ఘనము కాదు గుణమే ఘనమ్మురా / విశ్వదాభిరామ వినురవేమ! అని వేమన వందల సంవత్సరాల క్రితమే చెప్పినప్పటికీ ఈనాటికీ ఆ పద్య భావం పెడచెవిన పెట్టబడుతోంది. వేమన, కులం కాదు ‘గుణమే’ ముఖ్యమన్నాడు. ‘మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను‘ అని గురజాడ అన్నారు. ఇవేమీ పట్టించుకోని మిర్యాలగూడకు చెందిన అమృత తండ్రి మారుతీరావు 2018లో దళితుడైన ఆమె భర్త ప్రణయ్ (Pranay Perumalla)ను పాశవికంగా పరువు పేరుతో హత్య చేయించాడు. ఇలాంటివారు దేశమంతా ఎందరో ఉన్నారు.
ఆరేళ్ల తర్వాత నల్లగొండ జిల్లా సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పు... మనిషి కంటే కులమే గొప్పదని నమ్మే హైందవ నాగరాజులకు చెంప దెబ్బనే చెప్పాలి. ఈ అంశం సమాజానికి ఎన్నో విషయాలను మరోసారి బహిర్గతం చేసింది. మరీ ముఖ్యంగా తల్లి దండ్రులు–పిల్లల బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేదాన్ని సుస్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో రచయిత డా‘‘ స్టీఫెన్ ఆర్... ఒక పనిని ప్రారంభించే ముందు, దాని ముగింపును దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. అమృత తండ్రి మారుతీరావులో మొదలైన అల్లుణ్ణి హత్య చేయించాలనే ఆలోచన నేడు కొన్ని కుటుంబాల శోకానికి కారణమైంది. కన్న కూతురిపై అపారమైన ప్రేమను పెంచు కున్న మారుతీ రావు జీవితాన్ని కోల్పోయాడు. అతని భార్య భర్తను కోల్పోయింది. అతని కూతురు తండ్రిని కోల్పోయింది. ఇటు అమృత భర్తను కోల్పోయింది. ఆమెకు పుట్టిన బిడ్డకు కన్నతండ్రి లేకుండా పోయాడు. మొదటి ముద్దాయికి ఉరిశిక్ష ఖరారుఅయింది. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ శూన్యమే మిగిలింది.
చదవండి : Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో హరేన్ పాండ్యా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అస్గర్ అలీ ఈ కేసులో కూడా నిందితుడు కావడం సామాన్య మనిషికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వ్యక్తులకు అసలు బెయిల్ మంజూరు కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ‘పరువా, కులమా... మీ చిరునామా ఎక్కడ’ అంటూ వెతికితే... దానికి సాహిత్యకారుల రచనల్లో సమాధానం దొరుకుతుంది. ‘ఎంచి చూడగా మనుజులందున మంచి– చెడులు అను రెండే కులములు’ అన్నాడు మహాకవి. సాటి మనిషిని మనిషిగా చూడలేని మనిషి మనోమందిరాలు ‘అపరిశుభ్ర విసర్జన శాలలుగానే’ మిగిలిపోతాయి. దీని ప్రక్షాళనకై అంతరంగ పారిశుద్ధ్య కార్మికులు కావాలి.
– డా. ఉడుము ఝాన్సీ తెలుగు అధ్యాపకురాలు, ఆర్జీయూకేటీ, నూజివీడు