
మంచిమాట
వ్యక్తి ఆస్థిత్వాన్నీ, గుర్తింపును నిర్వచించేవాటిలో మొదటిది అతనికి తనపై తనకున్న అవగాహన. వర్తమానంలో తానే స్థితిలో ఉన్నాడు, భవిష్యత్తులో తాను చేరాలనుకునే ఉన్నత స్థానం ఏమిటి అన్నది స్థిరంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలి. ఆవిధంగా తనను తాను ముందుగా అంచనా వేసుకోవడం ప్రతివారికీ అవసరం. స్వీయ పరిశీలన చేసుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం వ్యక్తి పురోగతి సాధించడంలో తీసుకోవవలసిన అత్యంత సమంజసమైన విధి.
విద్యలోనూ, విషయగ్రాహ్యతలోనూ అంతగా రాణించే శక్తిలేని మనిషి, తాను ఎంత దృఢమైన రీతిలో ఉన్నతస్థానాన్ని అధిరోహించాలని భావించినా, సాధారణ పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఎందుకంటే, అతనికున్న మానసిక బలం, శారీరిక బలం కార్యసాధనకు సహకరించాలి కదా..!! అయితే, ఇది దుస్సాధ్యమైన విషయంగా పరిగణించ వలసిన పనిలేదు.
మనం అనుకున్నదానికంటే, మన అవగాహన గుర్తించినదానికంటే, ఎంతో అధికమైన శక్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. కృతనిశ్చయంతో ‘‘నేను నా రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించగలను’’ అని భావించి, ఉద్యమిస్తే, ఉత్తమ ఫలితాలను సాధించడం కష్టమైన విషయమేమీ కాదు. అంతే కాదు.. అదే కృషిని త్రికరణశుద్ధిగా కొనసాగిస్తే, ఉన్నతస్థానంలో నిలకడను సాధించి నిలబడ గలగడమూ కష్టమైన పనేమీ కాదు.
స్వీయనియంత్రణ అనుకున్నప్పుడు ప్రతివ్యక్తీ తాను రోజుకు ఎంత సమయాన్ని కార్యసాధన కోసం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాడనేది ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. కాసేపు మొక్కుబడిగా పనిచేసి, అనుకున్న ఫలితం రాలేదని భావించడంవల్ల ప్రయోజనం లేదుకదా..!! ఉన్నతలక్ష్యాలను నిర్దేశించుకున్నవ్యక్తి ఎటువంటి దురలవాట్లకూ బానిసకాకుండా ఉండడమూ స్వీయనియంత్రణలో అంతర్భాగమే..!!
భరతజాతి ముద్దుబిడ్డల్లో ఒకరై ప్రకాశించిన రామకృష్ణ పరమహంస వ్యక్తిత్వవికాసానికి సంబంధించిన అంశాల్లో అందరికీ ప్రయోజనకరంగా భాసించేలా ప్రభోధించిన అద్భుతమైన వాక్యం ‘‘ముందుగా నిన్ను నీవు తెలుసుకో’’. భవిష్యత్తు బంగరుబాటకావాలంటే, ఎవరైనా సరే, ముందుగా తనలో ఉన్న లోపాలమీద, బలహీనతలమీద, చేసే తప్పులమీద దృష్టి పెట్టాలి. ఆ తప్పులను లేదా లోపాలను సరిదిద్దుకునే క్రమాన్ని గుర్తెరిగి, అత్యంత శీఘ్రంగా వాటిని తొలగించుకుని, అప్పుడు భావి కార్యాచరణకు నడుం బిగించాలి.
తనను తాను సరిచేసుకుని ముందుకు సాగే విధానంలో సాధకుడు సానుకూలమైన ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలకూ చోటు యివ్వకూడదు. ప్రతిమనిషీ తన లక్ష్యాన్ని సాధించడానికి కొందరినుంచి స్ఫూర్తిని పొందుతూ ముందుకు సాగుతాడు. తనకు స్ఫూర్తిదాతయైన వ్యక్తి ఆధ్యాత్మికంగా శక్తిమంతుడు కావచ్చు, లేదా ఒక జనహితం కోసం కృషి చేసే నాయకుడో, సమాజ సేవకుడో లేక క్రీడాకారుడో కావచ్చు. అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్న వారో, తమ చేతల ద్వారా చరిత్రలో నిలిచిపోయిన ఏ వ్యక్తి నుంచైనా స్ఫూర్తిని పొందవచ్చు. తాను పొందిన అమేయమైన స్ఫూర్తిని, అమలుపరచడంలో ఎడతెగని ఆర్తిని కనబరచి, త్రికరణశుద్ధిగా కృషి చేస్తే, భవిత సాధకునికి తప్పనిసరిగా దీప్తివంతమవుతుంది.
తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో ప్రతివ్యక్తీ స్వీయ క్రమశిక్షణ పాటించడం అత్యంత అవసరం. ఆత్మనియతితో తమపై తాము విధించుకుని అమలుపరచే జీవన విధానమే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి. జీవితంలో లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎంతోమంది ఓటమి పాలవ్వడం లేదా ఆశించిన గమ్యాన్ని అందుకోకపోవడానికి కారణం స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. జనించినప్పుడు జీవులందరూ ఒకేరకమైన రీతిలో జనించినా, అందులో కొంతమంది వ్యక్తులు మాత్రమే అసాధారణమైన విజయాలను సాధించడానికి, తాము అనుకున్న ఎత్తుకు ఎదగడానికి కారణం వారు నిత్యమూ పాటించే స్వీయ నియంత్రణ లేక క్రమశిక్షణ అని చెప్పవచ్చు.
– వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి