
శమీ వృక్షానికీ, విజయదశమి పండుగకూ సన్నిహిత సంబంధం. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ‘శమీ’ అంటే అగ్ని అని కూడా అర్థం. అగ్ని అదృశ్యంగా శమీవృక్షంలో నిక్షిప్తమై ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి. యజ్ఞాల లాంటి పవిత్ర కార్యాలలో జమ్మి కర్రలు మథించి, అగ్ని పుట్టించి, హోమాలు చేస్తారు. శమీవృక్షం ప్రస్తావన రుగ్వేదంలో, అధర్వ వేదంలో కనిపిస్తుంది. ఇక పురాణ ఇతిహాసాలలో సరేసరి. అంటే, అతి ప్రాచీన కాలం నుంచి భారతీయులు శమీవృక్షాన్ని పవిత్రమైన వృక్షాలలో ఒకటిగా భావిస్తూ వస్తున్నారు.
ఇక, ‘విజయ’ అంటే శ్రవణా నక్షత్రంలో కలిసివచ్చే దశమి తిథి. ఇలా కలవటం ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షంలో జరుగుతుంది. ఆ ‘విజయ’ దశమి రోజు సర్వదా శుభదినం. అంటే, మీనమేషాలూ, గోచార, గ్రహచారాలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి శుభకార్యాలకైనా విజయదశమి మంచి రోజే!
విజయదశమి దసరా నవరాత్రులలో ఆఖరి రోజు. చండముండులూ, మహిషాసురుడూ వంటి రాక్షసులందరినీ 9 రోజుల భీషణ యుద్ధంలో సంహరించిన దుర్గాదేవి, విజయదశమి నాడు విజయిగా, అపరాజితగా నిలిచింది. ఈ అపరాజిత రాజాధి రాజులను కూడా శాసించే శ్రీమహారాజ్ఞి కనుక, విజయదశమినాడు దుర్గాదేవిని రాజరాజేశ్వరిగా అలంకరించడం ఆనవాయితీ. విజయ దశమినాడు అపరాజితా పూజ చేయడం ఇక్ష్వాకుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. శ్రీరాముడు జమ్మి చెట్టును అపరాజితా దేవి ప్రత్యక్ష స్వరూపంగా భావించి, శమీపూజ ద్వారా దేవి అనుగ్రహం పొంది రావణ సంహారం చేశాడని దేవీ భాగవతం చెబుతోంది. రాజులకు యుద్ధ జయమూ, ఇతరులకు కార్య విజయమూ ఇవ్వగలదు గనక జమ్మి చెట్టు ‘విజయద–శమీ’ వృక్షం. అందుకే ఆబాలగోపాలం విజయదశమి నాడు శమీ పూజ చేసే ఆచారం కొనసాగుతూ వస్తున్నది.
చదవండి: దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?
పూజ తరవాత అపరాజితా ప్రసాదంగా జమ్మి ఆకులను కోసి తెచ్చుకొని, వాటిని ‘బంగారం’లా దాచుకోవటం, కొన్ని ఆకులను పెద్దల చేతిలో ఉంచి, నమస్కరించి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం, దసరా పూజల సందడిలో భాగం. పనిలో పనిగా, ఆ పరిసరాలలోనే ఎగురుతుండే పాలపిట్టను చూసి, దాని నిసర్గ సౌందర్యాన్ని మెచ్చుకోవటం కూడా శుభకరం అని ఆస్తికుల నమ్మకం. విజయదశమి సందర్భంగా అపరాజితా దేవి ఆశీస్సులు అందరికీ అంది, ఆనందం కలిగించాలని ఆకాంక్షలు!!
– ఎం. మారుతి శాస్త్రి