
అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో 8 గంటలపాటు నిర్బంధం
‘వ్యక్తిగత’ తనిఖీలు చేసిన పురుష అధికారి
అలాస్కా యాంకరేజ్ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
వాషింగ్టన్: విదేశీ పర్యాటకులతో తరచూ అనుమాన, అవమానకర రీతిలో ప్రవర్తించిన అమెరికా దర్యాప్తు అధికారులు మరోమారు తమ బుద్ధిచూపించారు. వ్యాపార, వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ యువపారిశ్రామికవేత్త శ్రుతి చతుర్వేది పట్ల అలాస్కాలోని యాంకరేజ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారు.
మహిళ అని కూడా చూడకుండా పురుష ఆఫీసర్‌తో ‘వ్యక్తిగత’తనిఖీలు చేయించారు. చలివాతా వరణంలో వెచ్చదనం కోసం ధరించిన అదన పు దుస్తులను విప్పించారు. కనీసం బాత్రూమ్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకధాటిగా 8 గంటలపాటు తమ అ«దీనంలో నిర్బంధించి పలురకాల ప్రశ్నలతో వేధించారు. కనీసం సాయంకోసం ఎవరికీ ఫోన్‌చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని శ్రుతి తర్వాత భారత్‌కు చేరుకున్నాక ‘ఎక్స్’సామాజిక మాధ్యమంలోని తన ఖాతాలో పోస్ట్‌చేశారు.
పవర్ బ్యాంక్‌పై అనుమానంతో..
‘‘ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు నా హ్యాండ్‌బ్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్ పవర్‌బ్యాంక్ ఉంది. అదేదో కొత్తరకం వస్తువు అన్నట్లు దానిని పోలీసులు అనుమానంగా చూశారు. వెంటనే ఎఫ్‌బీఐ అధికారులను రప్పించి తనిఖీలు చేయించారు. తర్వాత నన్ను ఇష్టమొచ్చినట్లు, అర్థంపర్థంలేని ప్రశ్నలతో వేధించారు. వాస్తవానికి మహిళా ఆఫీసర్‌కు తనిఖీలు చేయాల్సిఉన్నా ఒక పురుష అధికారి వచ్చి నన్ను తనిఖీలు చేశాడు. విపరీతమైన చలికారణంగా ధరించిన వెచ్చటి దుస్తులను విప్పించాడు. ఏకధాటిగా 8 గంటలపాటు ఎటూ వెళ్లనివ్వలేదు. కనీసం బాత్రూమ్కు కూడా పోనివ్వలేదు. సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి వీల్లేకుండా ఫోన్, మనీ పర్సు లాక్కున్నారు. అన్ని రకాల తనిఖీలు చేసి చివరకు ఏమీ లేవని నిర్ధారించుకుని వదిలేశారు.
నా ఖరీదైన లగేజీ బ్యాగ్‌ను వాళ్లే అట్టిపెట్టుకున్నారు. నా వస్తువులను బయటకుతీసి నాసిరకం వేరే బ్యాగులో కుక్కి ఇచ్చారు. భారత్‌కు ఆవల ఉన్నప్పుడు భారతీయులు శక్తిహీనులు అన్నట్లు అమెరికా పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు ప్రవర్తించారు’’అని శ్రుతి ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన పోస్ట్‌ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. ‘ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్’, చర్చా వేదిక అయిన ‘ఛాయ్‌పానీ’లను శ్రుతి స్థాపించారు. మహిళను గంటల తరబడి అమెరికా అధికారులు వేధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
🛑 Shruti Chaturvedi, an entrepreneur from India🇮🇳, was held for eight hours at a US airport because of a power bank in her luggage that was deemed suspicious.#Ukraine #ShrutiChaturvedi #USA #Entrepreneur pic.twitter.com/2lrKWXRzPR
— Dainik Shamtak Samachar (@DainikShaamTak) April 8, 2025