
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజుకో నిర్ణయంతో ఫెడరల్ యంత్రాంగాన్ని అయోమయంలోకి నెడుతున్న అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వాములం కాలేమంటూ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్‌లో పని చేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
ఇదే సమయంలో అత్యంత ముఖ్యమైన ప్రజా సేవల విభాగాన్ని ధ్వంసం చేసేందుకు తమ నైపుణ్యాన్ని వినియోగించాలంటూ అందిన ఉత్తర్వులను తిరస్కరిస్తూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వీరు ప్రకటించారు. అమెరికా ప్రజలకు సేవ చేస్తామంటూ విధుల్లో చేరేటప్పుడు చేసిన వాగ్దానాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో నెరవేర్చలేమని స్పష్టమైందంటూ వారు సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించే బాధ్యతలను చేపట్టిన డోజ్ యంత్రాంగంలోని వారంతా రాజకీయ నేపథ్యం కలిగిన వారనీ, వీరికి అందుకు అవసరమైన నైపుణ్యాలు గానీ, అనుభవం గానీ లేవని అందులో తెలిపారు. బాధ్యతల నుంచి వైదొలగిన వారిలో ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు ఉన్నారు.
వీరు గతంలో అమెజాన్, గూగుల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలను నిర్వహించిన అనుభవజ్ఞులు. ఒబామా హయాంలో హెల్త్‌కేర్ విధానాలను అమలు చేసేందుకు యూఎస్ డిజిట్ సర్వీస్ పేరుతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విభాగానికి చెందిన 40 మంది సిబ్బందిని ఈ నెల మొదట్లో ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే.
BREAKING: 21 employees have just RESIGNED from Elon Musk's DOGE, refusing to "dismantle critical public services."
“We swore to serve the American people and uphold our oath to the Constitution across presidential administrations,” the 21 staffers wrote in a joint resignation… pic.twitter.com/7ra4Hatqia— Brian Krassenstein (@krassenstein) February 25, 2025
40% నిరుపయోగమే..
అధికారంలోకి రాగానే ట్రంప్ ఏర్పాటు చేసిన ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ రద్దు చేసిన కాంట్రాక్టుల్లో 40 శాతం నిరుపయోగమేనని తేలింది. వాటివల్ల ఖజానాకు నిధులు ఆదా అయ్యేదేమీ లేదని వెల్లడైంది. గత వారం నాటికి 1,125 కాంట్రాక్టులను డోజ్ రద్దు చేసింది. వాటిలో 417 కాంట్రాక్టుల రద్దు వల్ల ప్రయోజనం లేదని తేలింది. ఇప్పటికే పూర్తిగా నిధులను ఖర్చు చేయడం దీనికి కారణమని వెల్లడైంది.