భారత్‌కు 2.1 కోట్ల డాలర్ల... ఎన్నికల నిధులు ఆపేశాం  | DOGE says cancelled 21 million Dollers grant for India voter turnout | Sakshi
Sakshi News home page

భారత్‌కు 2.1 కోట్ల డాలర్ల... ఎన్నికల నిధులు ఆపేశాం 

Feb 17 2025 4:47 AM | Updated on Feb 17 2025 8:55 AM

DOGE says cancelled 21 million Dollers grant for India voter turnout

మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ ప్రకటన 

మన ఎన్నికలపై అమెరికా జోక్యమా? 

యూపీఏ హయాంలోని నిర్వాకమే: బీజేపీ 

వాషింగ్టన్‌: విదేశీ నిధులకు కత్తెర వేసే చర్యల్లో భాగంగా భారత్‌కు అందజేస్తున్న 2.1 కోట్ల డాలర్ల ఎన్నికల నిధులను నిలిపేస్తున్నట్టు అమెరికా చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. భారత్, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాలకు కోట్లాది డాలర్ల ఎన్నికల నిధులిచ్చే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్‌) ఆదివారం ప్రకటించింది.

 అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేస్తున్న కార్యక్రమాలన్నీ రద్దు చేసినట్టు ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. ఆర్థిక వనరుల వృథాకు ముకుతాడు వేసేందుకు డోజ్‌ను అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం తెలిసిందే. ‘‘భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి 2.1 కోట్ల డాలర్ల చొప్పున ప్రత్యేకిస్తూ వస్తున్నాం. ఇకపై ఆ ఫండింగ్‌ను నిలిపేస్తున్నాం’’ అని డోజ్‌ వెల్లడించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. 

ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో భేటీ అయిన మూడు రోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే భారత్‌కు ఇస్తున్నట్టు చెబుతున్న ఈ 2.1 కోట్ల డాలర్లను ఎప్పటినుంచి, ఎంత తరచుగా, ఎవరికి అందజేస్తూ వస్తోందన్న దానిపై స్పష్టత లేదు. ఈ వ్యవహారంపై బీజేపీ తక్షణం స్పందించింది. ఇది కచ్చితంగా భారత ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమేనంటూ దుయ్యబట్టింది. 

‘‘ఓటింగ్‌ పెంచడానికి 2.1 కోట్ల డాలర్లా? దీని వల్ల ఎవరికి లాభం చేకూరుతూ వస్తున్నట్టు? కచ్చితంగా అధికార పారీ్టకైతే కాదు!’’ అంటూ పార్టీ ఐటీ విభాగ సారథి అమిత్‌ మాలవీయ ఆదివారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నిధులను కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే పొందిందని ఆరోపించారు. ‘‘2012లో నాటి ప్రధాన ఎన్నికల అధికారి ఎస్‌.వై.ఖురేషి నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం జార్జ్‌ సోరోస్‌కు చెందిన ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ తాలూకు ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎలక్టోరల్‌ సిస్టమ్స్‌తో ఒప్పందం చేసుకుంది. 

అలా మన ఎన్నికల వ్యవస్థను విదేశాలకు అప్పగించడానికి కూడా వెనకాడలేదు! ఇప్పుడు వాళ్లే సీఈసీ నియామకంలో పారదర్శకత లేదని గగ్గోలు పెడుతున్నారు’’ అని దుయ్యబట్టారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులను ఈసీ వంటి సంస్థల్లోకి చొప్పించేందుకు యూపీఏ వీలు కల్పించిందని డోజ్‌ ప్రకటనతో స్పష్టమవుతోందన్నారు. బంగ్లాదేశ్‌ను రాజకీయంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 2.9 కోట్ల డాలర్లను కూడా నిలిపేస్తున్నట్టు డోజ్‌ పేర్కొంది. మరో 15 పై చిలుకు దేశాలకు ఇస్తున్న నిధులకూ మంగళం పాడుతున్నట్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement