
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సీక్వెల్స్ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే అదే లైన్‌తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్‌తో కొత్త ట్రెండ్‌ని సెట్ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్.
నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్‌లు రెండూ కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.
అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.
నిజానికి హిట్ ‘హిట్ 2’లో నాని కనిపించినట్టే హిట్ 3లో హీరో అడివి శేష్, విశ్వక్‌సేన్ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్ మాత్రం స్పెషల్ రోల్ చేస్తున్నాడు కానీ, విశ్వక్‌సేన్ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్ సేన్ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్ 2లో చేసినట్టే... క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్‌చల్ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్ చేసే విధంగా ‘హిట్ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్‌ప్రైజ్ కోసం సీక్రెసీ మెయిన్‌టైన్ చేస్తుందా? చూడాలి.