
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) 'జాక్' సినిమా ఏప్రిల్ 10న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషల్‌మీడియాలో సిద్ధూ డైలాగ్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే, సినిమా థియేటర్స్‌లో చూద్దామని ఆశగా ఉన్న ప్రేక్షకులకు నిరాశ ఎదురుకానుంది అంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వం వహించారు. ఇందులో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.

జాక్‌కు 'గాండీవధారి అర్జున' చిక్కులు
2023లో విడుదలైన వరుణ్ తేజ్'గాండీవధారి అర్జున'(Gandeevadhari Arjuna) చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్‌నే ఇప్పుడు జాక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పుడు ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడంతో చాలామంది నష్టపోయారు. ముఖ్యంగా గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారట. గాండీవధారి అర్జున సినిమా విడుదల సమయంలో రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్నామని, అందుకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేశారట. ఆ సినిమాతో తాము పూర్తిగా మునిగిపోయినట్లు చెప్పుకొచ్చారని సమాచారం. డీల్ ప్రకారం తమకు డబ్బులు వెనక్కివ్వలేదని తెలిపిన వారు.. ఆ సెటిల్మెంట్ జరిగే వరకు ‘జాక్’ సినిమాను విడుదల కానివ్వమని పెద్ద పంచాయితీ పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గాండీవధారి నష్టాలు జాక్‌ను అడ్డుకుంటున్నాయిని నెటిజన్లు తెలుపుతున్నారు.
వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా 'గాండీవధారి అర్జున' చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్‌లో సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అయితే, ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం రూ. 17 కోట్లు మాత్రమే చేసింది. ఆపై బాక్సాఫీస్ వద్ద రూ. 4 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. దీంతో చాలామంది పంపిణీదారులు ఈ సినిమాతో నష్టపోయారని తెలుస్తోంది.