
నటి దియా మీర్జా మన హైదరాబాదీ అమ్మాయే. మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్‌గా అందాల సుందరిగా కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత వరుసగా విభిన్న భాషల్లో సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తెలుగులో ఆమె చివరగా నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో చేసింది. సినిమాలతో పాటు పలు రకాల వ్యాపారాలు కూడా చేస్తూ స్థిరపడిన దియా మీర్జా... వ్యక్తిగత జీవితంలో ప్రేమ పెళ్లి మాత్రం విఫలమైంది. ఆమె గత 2014లో తన వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాని పెళ్లాడింది. అయితే ఐదేళ్లలోనే ఆ పెళ్లి పెటాకులైందని ఆమే స్వయంగా ప్రకటించింది. అనంతరం రెండేళ్లు గ్యాప్ ఇచ్చి అప్పటికే వివాహితుడు, ఒక బిడ్డకు తండ్రి అయిన వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుని దియా మీర్జా రేఖిగా మారింది. అయితే విడాకుల తర్వాత కూడా ఎప్పుడూ తన మొదటి పెళ్లి గురించి దియామీర్జా మాట్లాడింది లేదు.
ఇటీవల మాత్రం ఒక ఇంటర్వ్యూలో, దియా మీర్జా తన పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఆ తరహా ఆలోచనల వెనుక ఉన్న పలు అంశాల్ని గురించి మాట్లాడుతూ తన రెండవ పెళ్లిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ తరహాలో చేసుకున్నట్టు వివరించింది.తమ ఇంటి తోటలోనే అత్యంత నిరాడబంరంగా సహజమైన పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. చేతితో తయారు చేసిన వ్యక్తిగతీకరించిన బహుమతులు స్థానిక సహజమైన అలంకరణ ఉత్పత్తులనే వివాహం కోసం వాడినట్టు తెలిపారు. ఆహార వ్యర్థాలను తగ్గించడానికి అతిథులకు శాకాహార మాంసాహార వంటకాల ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారిస్తూ, భోజనాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశామన్నారు.
కేవలం ఓ మహిళా పూజారితో దంపతులు సాదాసీదాగా వేడుక పూర్తి చేశామన్నారు. వధువుగా ధరించడానికి బాలీవుడ్ వధువులకు సాధారణమైన లెహెంగాకు బదులుగా ఎరుపు రంగు బనారసీ చీరను దియా ఎంపిక చేసుకోవడం విశేషం.
ఇదే సందర్భంగా ఆమె తన మొదటి పెళ్లి గురించి కూడా గుర్తు చేసుకుంది. ఆ పెళ్లి ఒక ఫార్మ్ హౌజ్‌లో జరిగింది. ఆడంబరంగా జరిగిన ఆ పెళ్లిలో ఆమె ఖరీదైన దుస్తులను ఎంచుకుంది. ఆ పెళ్లిలో ఆమె బాలీవుడ్ వధువుల తరహాలోనే లెహంగానూ ధరించింది. అయితే వివాహాల తర్వాత బ్రైడల్ లెహంగాలు తరచు నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది. వాటిని పారవేయలేక, ఇటు ధరించనూ లేక వార్డ్‌రోబ్స్‌లో ఉంచుతారంది. ఒక పర్యావరణ అనుకూల మనస్తత్వంతో తాను దాన్ని ఇష్టపడలేదని చెప్పింది. దాంతో ఆమె తన మొదటి పెళ్లిలో తాను ధరించిన తన వివాహ లెహంగాను వేలం వేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే దాన్ని మంచి ధరకు వేలం వేశానని వెల్లడించింది.
నిరుపయోగంగా పడి ఉండకూడదనే తాను తన రెండవ పెళ్లికి సాధారణ చీరను ఎంచుకున్నానని తన భర్త వైభవ్ రేఖీ సైతం అదే పనిచేశారని తెలిపింది. పెళ్లి తర్వాత అలమారాలో ఉపయోగించకుండా కూర్చోకుండా జీవితాంతం ధరించగలిగే దుస్తులను ఆయన కూడా ఎంచుకున్నట్లు కూడా ఆమె పేర్కొంది. ఆమె పెళ్లి రోజున, దియా మీర్జా సాంప్రదాయ ఎరుపు రంగుకు దూరంగా డిజైనర్ రీతూ కుమార్ తయారు చేసిన ఆకుపచ్చ జర్దోసీ ఘరారాను ఎంచుకుంది.