
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిసెంబర్ 26న చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులతో పాటు కలవబోతున్నట్లు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజన పరామర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత చిత్రపరిశ్రమలో తీవ్ర అలజడి నెలకొంది. అయితే, సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో సీఎంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలవనున్నారు.
సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఇదే అంశం గురించి ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు తాను కూడా కలవనున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా.. ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని దిల్ రాజు అన్నారు. సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాలు ఉన్నాయి.
