
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
ములుగు రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ స్థాయిలో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు క్రీడలు మానసికోల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుంది. ఈ క్రీడా శిక్షణ శిబిరాలను యువజన సర్వీసుల క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో ఈ శిబిరాలను వినియోగించుకుని ఆసక్తి కలిగిన క్రీడల్లో రాణించాలి.
శిక్షణ శిబిరాల ఏర్పాటుకు కసరత్తు
జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 10 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో చేరేందుకు ఎనిమిదేళ్ల నుంచి 14ఏళ్ల బాలబాలికలు అర్హులు. మే 1వ తేదీ నుంచి 31 వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. ఉదయం 6 నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7గంటల వరకు శిక్షణ ఇస్తారు. శిబిరాల్లో సైక్లింగ్, ప్లోర్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, క్రికెట్, ఖో–ఖో, తైక్వాండో, వాలీబాల్, కరాటే, రెజ్లింగ్ తదితర వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
కోచ్‌ల ఎంపిక పూర్తి
జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు కలెక్టర్ ఆదేశాల మేరకు కోచ్‌ల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం యువజన సర్వీసుల క్రీడల శాఖకు రూ.1.05లక్షలు కేటాయించింది. ఇందులో కోచ్‌లకు రూ.40 వేలు, క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.50 వేలు, మైదానం అభివృద్ధికి, శిక్షణ శిబిరం నిర్వహణకు రూ.10 వేలు, క్రీడల సమయంలో ప్రమాదం జరగడం, చిన్న చిన్న గాయాలైన వెంటనే చికిత్స అందించేందుకు రూ.5 వేలను కేటాయించింది. శిబిరాల్లో కోచింగ్ ఇచ్చే వారికి నెలకు రూ. 4వేల గౌరవ వేతనం అందించనున్నారు. శిబిరం నిర్వహణకు వెయ్యి చెల్లిస్తారు. ములుగులో క్రికెట్, కబడ్డీ, ఏటూరునాగారంలో కబడ్డీ, మదనపల్లిలో సైక్లింగ్, జగ్గన్నపేటలో రెజ్లింగ్, యోగా, వాజేడులో వాలీబాల్, ఏటూరునాగారంలో హ్యాండ్‌బాల్, ఆకులవారి ఘణపూర్‌లో అథ్లెటిక్స్ శిబిరాలను కొనసాగిస్తారు.
క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ క్రీడలకు సంబంధించిన 10 శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌ల ఎంపిక పూర్తి చేశాం. మే 1నుంచి 31వరకు శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి కలిగిన 14ఏళ్ల లోపు బాలబాలికలు అర్హులు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 25 మందికి అవకాశం ఉంటుంది.
– తుల రవి,
జిల్లా యువజన సర్వీసుల క్రీడల అధికారి
మే 1నుంచి 31వరకు నిర్వహణ
జిల్లాలో 10 శిబిరాలు.. కోచ్‌ల ఎంపిక పూర్తి
ఒక్కో శిబిరంలో 20నుంచి 25 మంది విద్యార్థులు

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు