
అందుకు వేరే సంస్థలు ఉన్నాయి
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్య
భువనేశ్వర్: ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ అవసరం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చెప్పారు. విచారణ కోసం ఇతర దర్యాప్తు సంస్థలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మిగతా రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ఈడీని ఏర్పాటు చేశారని అన్నారు. ఈడీ ఇప్పుడు ఎన్నో రకాలుగా వివాదాల్లో చిక్కుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను పక్కనపెట్టడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరాలపై విచారణకు ఆదాయపు పన్ను శాఖ వంటి విభాగాలు ఉండగా ఈడీ ఎందుకని ప్రశ్నించారు.
అఖిలేష్ యాదవ్ బుధవారం ఒడిశాలోని భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈడీ అవసరం ఇప్పుడు లేదని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. భుశనేశ్వర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ జెనా నివాసానికి అఖిలేష్ వెళ్లారు. దీంతో శ్రీకాంత్ జెనా సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, అందులో వాస్తవం లేదని వారిద్దరూ స్పష్టతనిచ్చారు.