
భువనేశ్వర్: దేశంలో రుతు పవనాల ఆగమనానికి సానుకూల సంకేతాలు లభిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి వానలు దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సామాన్యంగా ఉంటాయి. వర్షాధార పంట పొలాల ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వర్షం కురుస్తుంది. జూన్ నెలలో రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా వర్షం కురుస్తుందని భారత వాతావరణ విభాగం సోమవారం ముందస్తు (లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్టు) సమాచారం జారీ చేసింది. రాష్ట్రంలో నైరుతి వానలు ప్రారంభమయ్యే తేదీ ఇంకా స్పష్టం కానట్లు వాతావరణ విభాగం తెలిపింది.
దేశవ్యాప్తంగా సాధారణం
నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుంది. అత్యధిక ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని భావిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 96 శాతం నుంచి 104 శాతం సమగ్ర వర్షపాతం ముందస్తు అంచనాగా వాతావరణ విభాగం పేర్కొంది.
పిడుగుపాటు హెచ్చరిక
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పిడుగుపాటు ప్రమాదాలు ఉన్నట్లు స్థానిక వాతావరణ విభాగం ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. బాలాసోర్, భద్రక్, సుందరగడ్, కెంజొహార్, మయూర్‌భంజ్, సోన్‌పూర్, బౌధ్, నువాపడా, కలహండి, కందమాల్, నవరంగపూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి, గజపతి, గంజాం, ఖుర్దా, నయాగడ్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో వాతావరణంలో మార్పు సంభవిస్తుందని ఉరుములు, మెరుపులతో పిడుగుపాటు సంఘటనలకు ముందస్తు సమాచారం జారీ అయింది.
సమగ్రంగా 21 జిల్లాల్లో కాల వైశాఖి వాతావరణం తాండవిస్తుందని ఎల్లో వార్నింగ్ జారీ అయింది. ఈ నెల 2వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం వరకు ఇటువంటి వాతావరణం బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడా, జగత్‌సింగ్‌పూర్, కటక్, ఢెంకనాల్, కెంజొహార్, మయూర్‌భంజ్, నువాపడా, కలహండి, కందమాల్, నవరంగపూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి, గజపతి, గంజాం, పూరీ, ఖుర్దా, నయాగడ్ జిల్లాల్లో నెలకొని ఉంటుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం వరకు బాలాసోర్, భద్రక్, దేవ్‌గడ్, అనుగుల్, కెంజొహార్, మయూర్‌భంజ్, సోన్‌పూర్, బౌధ్, నువాపడా, బలంగీరు, కలహండి, కందమాల్, నవరంగపూర్, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలకు పిడుగుపాటు వాతావరణం నెలకొంటుంది.