
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్ (ఐటీ) నిబంధనలపై ట్విటర్ స్పందించింది. కొత్త ఐటీ నిబంధనల అమలుకు 3 నెలలు గడువును ట్విటర్ కోరింది. కేంద్రంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనలపై సోషల్ మీడియా సంస్థలకు ప్రతిబంధకంగా మారాయి. ఈ క్రమంలో కేంద్రం, వాట్సప్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కొత్త నిబంధనల్లో మార్పుల కోసం న్యాయపరంగా వెళ్తామని ట్విటర్ పేర్కొంది. మే 26వ తేదీ నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. కొత్త డిజిటల్ నిబంధనల వల్ల తమ వినియోగదారుల ప్రైవసీ ప్రొటెక్షన్ విచ్ఛిన్నం అవుతుందని వాట్సాప్ వాదిస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ నిబంధనలపై ట్విటర్ స్పందించింది. భారత చట్టాలను అమలు చేసేందుకు పాటిస్తామని పేర్కొంటూనే ఆ నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విటర్ కింది విధంగా స్పందించింది.
‘మేము భారత ప్రజల సేవకు కట్టుబడి ఉన్నాం. ప్రజల సమాచార గోప్యతకు భంగం కలిగించం. కరోనా సమయంలో ట్విటర్ ప్రజలకు ఉన్నదని అందరికీ తెలిసిందే. అలాంటి సేవలను అందుబాటులో ఉంచేందుకు మేం భారత న్యాయసూత్రాలకు అనుగుణంగా పని చేసేందుకు ప్రయత్నిస్తాం. గోప్యత.. పారదర్శకత విషయంలో మేం కచ్చితంగా పాటిస్తాం. ఈ విషయంలో ప్రపంచమంతటా ఒకే నిబద్ధతతో ఉన్నాం. మేం ఇదే కొనసాగిస్తాం. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూనే చట్టాలకు లోబడి ఉంటాం’ అని ట్విటర్ ప్రతినిధి తెలిపారు.
‘అయితే భారత కొత్త చట్టాలతో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. కొంతకాలంలో భారత్‌లో మా ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలు, మేం సేవలు అందిస్తున్న వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ కొత్త నిబంధనలు ముప్పు కలిగిస్తాయని మా ఆందోళన. ఇలాంటి చట్టాలు రావడం బాధాకరం. సోషల్ మీడియాలో ప్రశాంత చర్చలకు భంగం కలగకుండా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి. దీనిపై భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తాం. ప్రజాప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానిదే’ అని ట్విటర్ స్పష్టం చేసింది.
చదవండి: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్