
న్యూఢిల్లీ, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీశక్తికి వందనం అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి అత్యంత అరుదైన నిర్ణయం తీసుకున్నారాయన. తన సోషల్ మీడియా అకౌంట్ల బాధ్యతలను ఎంపిక చేసిన మహిళలకు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే వణక్కం.. అంటూ ఆయన ఖాతా నుంచి ఓ పోస్ట్ అయ్యింది.
ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఇండియన్ గ్రాండ్ చెస్ మాస్టర్ వైశాలి రమేష్‌బాబు(Vaishali Rameshbabu)కి అప్పగించారు. ఇదే విషయాన్ని మోదీ ఎక్స్ ఖాతా నుంచి వైశాలి తెలియజేశారు. తాను చెస్ ప్లేయర్‌నని, దేశం తరఫు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పోస్ట్ చేశారామె. ప్రధాని ఖాతాను నిర్వహించడం తనకు దక్కిన గౌరవమని అన్నారు. ఈరోజంతా ఆమే ఆయన ఖాతా బాధ్యతలను చూసుకోనున్నారు.


ఆరో ఏట నుంచి నేను చెస్ ఆడుతున్నాను. అది నాకొక ఉత్తేజకరమైన ప్రయాణం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ కలలు సాకారం చేసుకోవడానికి ముందుకుసాగండి. ఆడపిల్లలకు అండగా నిలవాలని తల్లిదండ్రులు, తోబుట్టువులను ఈసందర్భంగా కోరుతున్నాను. వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. వారు అద్భుతాలు చేయగలరు అని వైశాలి సందేశం ఉంచారు. మరోవైపు..

వైశాలితో పాటు న్యూక్లియర్, స్పేస్ సైంటిస్ట్‌లు అయిన ఎలినా మిశ్రా, శిల్పి సోనీ.. మోదీ ఖాతా నుంచి పోస్టులు పెట్టారు. భారతదేశం సైన్స్ పరిశోధనలకు అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. మరింత ఎక్కుమంది మహిళలు ఈ రంగాన్ని ఎంచుకోవాలని కోరారు.

నేను అనితా దేవిని..
నలందా జిల్లాకు చెందిన అనితాదేవి ప్రధాని ఖాతా నుంచి తన విజయాలు వెల్లడించారు. ‘‘నేను జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా కాళ్ల మీద నిలబడి, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. 2016లో ఆ దిశగా అడుగేశాను. అప్పుడే స్టార్టప్‌లపై క్రేజ్ పెరుగుతోంది. నేను కూడా మాదోపుర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రారంభించాను. నాతో కలిసి పనిచేసిన మహిళలు స్వయంసమృద్ధి సాధించడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. వారి కుటుంబాలు బాగుపడటం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం మహిళలకు గౌరవాన్ని ఇస్తుందని నా నమ్మకం. మీరు అంకిత భావం, కృషితో ముందుకుసాగాలని బలంగా అనుకుంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు’’ అంటూ తన స్టోరీ వెల్లడించారు.



ప్రధాని మోదీ గతంలోనూ ఇలానే తన సోషల్ మీడియా అకౌంట్లను స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగించారు కూడా. ఇక.. మహిళా దినోత్సవం(Women's Day 2025) పురస్కరించుకొని ఇవాళ ప్రధాని భద్రతను కూడా పూర్తిగా మహిళా పోలీసులే పర్యవేక్షించనుండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అంతకు ముందు తన మహిళా దినోత్సవ సందేశంలో.. ‘‘వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీయే ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తోంది’’ అని అన్నారాయన.