దేశానికే తలమానికం: ప్రధాని మోదీ | PM Narendra Modi Launches Pamban Rail Bridge In Rameshwaram | Sakshi
Sakshi News home page

దేశానికే తలమానికం: ప్రధాని మోదీ

Published Mon, Apr 7 2025 4:30 AM | Last Updated on Mon, Apr 7 2025 6:31 AM

PM Narendra Modi Launches Pamban Rail Bridge In Rameshwaram

రామేశ్వరం–తాంబరం (చెన్నై) కొత్త రైలు ప్రారంభం.. ఆపై సభలో ప్రసంగం

తమిళ మాధ్యమంలో వైద్యవిద్య అందించాలని స్టాలిన్‌ ప్రభుత్వానికి సూచన

తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని స్పష్టికరణ   

మోదీ కార్యక్రమానికి గైర్హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదు. 2014 కంటే ముందు పదేళ్లతో పోలిస్తే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చాం. తమిళనాడుకు రైల్వే బడ్జెట్‌ ఏడు రెట్లు పెంచాం. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అయినా నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. 

సాక్షి, చెన్నై: తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పంబన్‌ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జిగా రికార్డుకెక్కిన ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ వంతెన దేశానికే తలమానికం అని వ్యాఖ్యానించారు. అలాగే రామేశ్వరం–తాంబరం (చెన్నై) కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. వర్టికల్‌ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగించే కోస్ట్‌గార్డ్‌ షిప్‌ను సైతం ప్రారంభించారు. 

అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ కీలకమైన కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ గైర్హాజరయ్యారు. ఆదివారం ఉదకమండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడంతో తాను రాలేకపోతున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చారు. నియోజకవర్గాల పునరి్వభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న స్టాలిన్‌ ప్రధాని మోదీ కార్యక్రమానికి వ్యూహాత్మకంగానే దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డీలిమిటేషన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఆయన ఇప్పటికే ప్రధానమంత్రిని కోరారు.  

తమిళంలో సంతకాలు చేయలేరా?  
తమిళనాడులో రూ.8,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాముడు అందించిన సుపరిపాలన మన దేశ నిర్మాణానికి పునాది అని చెప్పారు. రాముడితో తమిళనాడుకు ఎంతో అనుబంధం ఉందంటూ సంగమ శకం నాటి సాహిత్యాన్ని ప్రస్తావించారు. శ్రీలంక నుంచి గత పదేళ్లలో 3,700 మంది తమిళ జాలర్లను వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు. 

వీరిలో 600 మందిని గత ఏడాది కాలంలోనే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తమిళ మాధ్యమంలో వైద్య విద్య అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల పేదలకు లబ్ధి కలుగుతుందన్నారు. తమిళనాడుకు ఇటీవల 11 నూతన మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. తమిళ భాషను, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రపంచంలో అన్ని మూలలకూ తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమిళనాడు నాయకుల నుంచి తనకు లేఖలు వస్తుంటాయని, కానీ, వాటిపై తమిళ భాషలో సంతకాలు ఉండడం లేదని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. కనీసం తమిళ భాషలో సంతకాలు చేయాలని కోరారు.  

నిధుల కేటాయింపులో వివక్ష లేదు  
తమిళనాడు మత్స్యకారులు కష్టపడి పనిచేస్తారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘పీఎం మత్స్య సంపద యోజన’ కింద తమిళనాడుకు గత ఐదేళ్లలో భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీవీడ్‌ పార్కులు, ఫిషింగ్‌ హార్బర్లు, ల్యాండింగ్‌ సెంటర్ల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఉద్ఘాటించారు. తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని తేల్చిచెప్పారు. 2014 కంటే ముందు పదేళ్లలో కేటాయించిన దాని కంటే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చామని వివరించారు. 

రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఈ నిధులు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని స్పష్టంచేశారు. తమిళనాడుకు రైల్వే బడ్జెట్‌ ఏడు రెట్లు పెంచామన్నారు. రాష్ట్రంలో 2014 కంటే ముందు రైలు ప్రాజెక్టులకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు ఏటా రూ.6,000 కోట్లు ఇస్తున్నామని తెలియజేశారు. 2014 తర్వాత రాష్ట్రంలో కేంద్ర నిధులతో 4,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు.  

రామనాథ స్వామి ఆలయంలో పూజలు  
ప్రధాని మోదీ రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ వ్రస్తాలు ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు శ్రీలంక నుంచి రామేశ్వరం చేరుకున్న ప్రధానమంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఆయనకు అభివాదం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. నూతన పంబన్‌ వంతెనను ప్రారంభించిన అనంతరం మోదీ రామనాథస్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఇది దైవిక యాదృచ్ఛికం 
హిందూ మహాసముద్రంలోని ప్రాచీన రామసేతును దర్శించుకోవడం ఒక  గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘‘కొద్ది సేపటి క్రితమే శ్రీలంక నుంచి హెలికాప్టర్‌లో వస్తూ రామసేతును దర్శించుకున్నాను. ఇదొక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నా. అయోధ్యలో బాలరాముడికి ఆదిత్యుడు తిలకం దిద్దిన సమయంలోనే ఇక్కడ రామసేతు దర్శనం కావడం దైవిక యాదృచి్ఛకం. రెండింటినీ ఒకేసారి దర్శించుకోవడం గొప్ప విషయం. శ్రీరాముడు మనందరినీ ఐక్యంగా కలిపి ఉంచే ఒక బలమైన శక్తి. ఆయన ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలన్నదే నా ఆకాంక్ష’’ అని మోదీ అన్నారు.

ఇంజనీరింగ్‌ అద్భుతం  
రామేశ్వరంలో పంబన్‌ వర్టికల్‌ సీ–లిఫ్ట్‌ బ్రిడ్జిని రూ.550 కోట్లతో నిర్మించారు. పొడవు 2.08 కిలోమీటర్లు. 99 స్పాన్లు ఉన్నాయి. మధ్యలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్‌ లిఫ్ట్‌ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వంతెన కిందినుంచి భారీ నౌకల రాకపోకలకు వీలుగా ఇది 22 మీటర్ల ఎత్తువరకు పైకి వెళ్లగలదు. నౌకలు వెళ్లిపోయిన తర్వాత యథాతథ స్థితికి చేరుకుంటుంది. ఎప్పటిలాగే రైళ్లు ప్రయాణం సాగించవచ్చు. ప్రధాన భూభాగంలోని మండపం రైల్వేస్టేషన్‌ను రామేశ్వరం దీవితో ఈ వంతెన అనుసంధానిస్తుంది.

 అత్యాధునిక ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి ఈ బ్రిడ్జి ఒక ఉదాహరణ. దీర్ఘకాలం మన్నికగా ఉండేలా నిర్మాణంలో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉపయోగించారు. హై–గ్రేడ్‌ రక్షణ పెయింట్‌ వాడారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనపై రెండు రైల్వే ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. భక్తులు రామేశ్వరం ఆలయానికి చేరుకోవడం ఇక మరింత సులభతరం కానుంది.

 ప్రధాన భూభాగం–రామేశ్వరం దీవి మధ్య 1914లో బ్రిటిష్‌ పాలకుల హయాంలో రైల్వే వంతెన నిర్మించారు. శతాబ్దం పాటు సేవలందించిన ఈ వంతెన గడువు తీరిపోవడంతో అదేచోట కొత్త వంతెన నిర్మాణానికి 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, ఆదివారం పంబన్‌ వంతెనను ప్రారంభించిన తర్వాత గంట సేపట్లో సాంకేతిక సమస్య నెలకొంది. కోస్ట్‌గార్డు నౌక కోసం వంతెనను 17 అడుగుల మేర పైకి ఎత్తారు. తిరిగి కిందకు దించే సమయంలో 10 అడుగుల వద్ద సాంకేతిక సమస్య ఏర్పడింది. రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement