new bridge
-
దేశానికే తలమానికం: ప్రధాని మోదీ
తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదు. 2014 కంటే ముందు పదేళ్లతో పోలిస్తే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చాం. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెంచాం. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అయినా నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సాక్షి, చెన్నై: తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పంబన్ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రికార్డుకెక్కిన ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ వంతెన దేశానికే తలమానికం అని వ్యాఖ్యానించారు. అలాగే రామేశ్వరం–తాంబరం (చెన్నై) కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. వర్టికల్ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగించే కోస్ట్‌గార్డ్ షిప్‌ను సైతం ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ కీలకమైన కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ గైర్హాజరయ్యారు. ఆదివారం ఉదకమండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడంతో తాను రాలేకపోతున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చారు. నియోజకవర్గాల పునరి్వభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న స్టాలిన్ ప్రధాని మోదీ కార్యక్రమానికి వ్యూహాత్మకంగానే దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డీలిమిటేషన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఆయన ఇప్పటికే ప్రధానమంత్రిని కోరారు. తమిళంలో సంతకాలు చేయలేరా? తమిళనాడులో రూ.8,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాముడు అందించిన సుపరిపాలన మన దేశ నిర్మాణానికి పునాది అని చెప్పారు. రాముడితో తమిళనాడుకు ఎంతో అనుబంధం ఉందంటూ సంగమ శకం నాటి సాహిత్యాన్ని ప్రస్తావించారు. శ్రీలంక నుంచి గత పదేళ్లలో 3,700 మంది తమిళ జాలర్లను వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు. వీరిలో 600 మందిని గత ఏడాది కాలంలోనే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తమిళ మాధ్యమంలో వైద్య విద్య అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల పేదలకు లబ్ధి కలుగుతుందన్నారు. తమిళనాడుకు ఇటీవల 11 నూతన మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. తమిళ భాషను, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రపంచంలో అన్ని మూలలకూ తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమిళనాడు నాయకుల నుంచి తనకు లేఖలు వస్తుంటాయని, కానీ, వాటిపై తమిళ భాషలో సంతకాలు ఉండడం లేదని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. కనీసం తమిళ భాషలో సంతకాలు చేయాలని కోరారు. నిధుల కేటాయింపులో వివక్ష లేదు తమిళనాడు మత్స్యకారులు కష్టపడి పనిచేస్తారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘పీఎం మత్స్య సంపద యోజన’ కింద తమిళనాడుకు గత ఐదేళ్లలో భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీవీడ్ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఉద్ఘాటించారు. తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని తేల్చిచెప్పారు. 2014 కంటే ముందు పదేళ్లలో కేటాయించిన దాని కంటే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఈ నిధులు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని స్పష్టంచేశారు. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెంచామన్నారు. రాష్ట్రంలో 2014 కంటే ముందు రైలు ప్రాజెక్టులకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు ఏటా రూ.6,000 కోట్లు ఇస్తున్నామని తెలియజేశారు. 2014 తర్వాత రాష్ట్రంలో కేంద్ర నిధులతో 4,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. రామనాథ స్వామి ఆలయంలో పూజలు ప్రధాని మోదీ రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ వ్రస్తాలు ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు శ్రీలంక నుంచి రామేశ్వరం చేరుకున్న ప్రధానమంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఆయనకు అభివాదం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. నూతన పంబన్ వంతెనను ప్రారంభించిన అనంతరం మోదీ రామనాథస్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ఇది దైవిక యాదృచ్ఛికం హిందూ మహాసముద్రంలోని ప్రాచీన రామసేతును దర్శించుకోవడం ఒక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘కొద్ది సేపటి క్రితమే శ్రీలంక నుంచి హెలికాప్టర్లో వస్తూ రామసేతును దర్శించుకున్నాను. ఇదొక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నా. అయోధ్యలో బాలరాముడికి ఆదిత్యుడు తిలకం దిద్దిన సమయంలోనే ఇక్కడ రామసేతు దర్శనం కావడం దైవిక యాదృచి్ఛకం. రెండింటినీ ఒకేసారి దర్శించుకోవడం గొప్ప విషయం. శ్రీరాముడు మనందరినీ ఐక్యంగా కలిపి ఉంచే ఒక బలమైన శక్తి. ఆయన ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలన్నదే నా ఆకాంక్ష’’ అని మోదీ అన్నారు.ఇంజనీరింగ్ అద్భుతం రామేశ్వరంలో పంబన్ వర్టికల్ సీ–లిఫ్ట్ బ్రిడ్జిని రూ.550 కోట్లతో నిర్మించారు. పొడవు 2.08 కిలోమీటర్లు. 99 స్పాన్లు ఉన్నాయి. మధ్యలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వంతెన కిందినుంచి భారీ నౌకల రాకపోకలకు వీలుగా ఇది 22 మీటర్ల ఎత్తువరకు పైకి వెళ్లగలదు. నౌకలు వెళ్లిపోయిన తర్వాత యథాతథ స్థితికి చేరుకుంటుంది. ఎప్పటిలాగే రైళ్లు ప్రయాణం సాగించవచ్చు. ప్రధాన భూభాగంలోని మండపం రైల్వేస్టేషన్‌ను రామేశ్వరం దీవితో ఈ వంతెన అనుసంధానిస్తుంది. అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ బ్రిడ్జి ఒక ఉదాహరణ. దీర్ఘకాలం మన్నికగా ఉండేలా నిర్మాణంలో స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించారు. హై–గ్రేడ్ రక్షణ పెయింట్ వాడారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనపై రెండు రైల్వే ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. భక్తులు రామేశ్వరం ఆలయానికి చేరుకోవడం ఇక మరింత సులభతరం కానుంది. ప్రధాన భూభాగం–రామేశ్వరం దీవి మధ్య 1914లో బ్రిటిష్ పాలకుల హయాంలో రైల్వే వంతెన నిర్మించారు. శతాబ్దం పాటు సేవలందించిన ఈ వంతెన గడువు తీరిపోవడంతో అదేచోట కొత్త వంతెన నిర్మాణానికి 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, ఆదివారం పంబన్ వంతెనను ప్రారంభించిన తర్వాత గంట సేపట్లో సాంకేతిక సమస్య నెలకొంది. కోస్ట్‌గార్డు నౌక కోసం వంతెనను 17 అడుగుల మేర పైకి ఎత్తారు. తిరిగి కిందకు దించే సమయంలో 10 అడుగుల వద్ద సాంకేతిక సమస్య ఏర్పడింది. రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు. -
వేగంగా కొత్త వంతెనల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నదులు, కాలువలు, వాగులు దాటడానికి పడవలు, బల్లకట్లు, పుట్టిలు వంటి ప్రమాదకర ప్రయాణాల నుంచి ప్రజలకు విముక్తి కలగనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రహదారుల పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రధాన, మైనర్ వంతెనల నిర్మాణాన్ని కూడా వేగంగా చేపడుతోంది. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ (నిడా) రెండో దశ కింద రూ.262.36 కోట్లతో 25 వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒక్కోవంతెనతో కనీసం లక్ష మంది ప్రజలకు నదులు, వాగుల మీదుగా రాకపోకలు సులభంగా సాగించొచ్చు. రాష్ట్ర ప్రధాన రహదారుల్లో 16, జిల్లా ప్రధాన రహదారుల్లో 7, ఇతర రోడ్లపై రెండు వంతెనలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 8 వంతెనల నిర్మాణం వేగం పుంజుకుంది. మిగిలిన 17 వంతెనల పనుల కోసం ఆర్ అండ్ బి శాఖ త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించనుంది. ► రాష్ట్ర ప్రధాన రహదారుల్లో రూ.87.22 కోట్లతో 16 వంతెనల నిర్మాణాన్ని ఆర్ అండ్ బి చేపట్టింది. వాటిలో ఆరు వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితోపాటు మిగతా 10 వంతెనల పనులను ఏడాదిలోగా పూర్తి చేయనున్నారు. ► జిల్లా ప్రధాన రహదారుల్లో రూ.162.95 కోట్లతో ఏడు వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో రెండు వంతెనల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మిగతా ఐదింటి పనులను ఆర్ అండ్ బి శాఖ త్వరలో ప్రారంభించనుంది. ► ఇతర రహదారుల్లో రూ.12.19 కోట్లతో రెండు వంతెనల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
మూసీపై నిర్మించనున్న వంతెనలకు కొత్త అందాలు
సాక్షి, హైదరాబాద్: మూసీపై దాదాపు డజను కొత్త వంతెనలు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం అవి వైవిధ్యంగా..విభిన్నంగా..కొత్త సొబగులతో అలరించేలా ఉండాలని భావిస్తోంది. అటు ట్రాఫిక్ చిక్కులు తీర్చడంతోపాటు ఇటు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తగిన వాస్తుశిల్పాలతో ఉండాలని భావిస్తోంది. మూసీ వంతెనలపై సాఫీ ప్రయాణమే కాకుండా చూడ్డానికి కూడా అందంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దుర్గం చెరువు, ట్యాంక్బండ్లు పర్యాటక ప్రాంతాలుగా కొత్త సొగసులతో ఆకట్టుకుంటుండంతో మూసీలపై నిర్మించే ఈ కొత్త వంతెనలు కూడా వాటిలాగే ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండాలని యోచిస్తోంది. వీటన్నింటి అంచనా వ్యయం దాదాపు రూ.390 కోట్లు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఆర్డీసీఎల్ (హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)ల ఆధ్వర్యంలో వీటిని నిర్మించనున్నారు. చదవండి: నీటిలో వణుకుతూ రాత్రంతా జాగారం ఇలా ఉండాలి.. ► ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా కొత్త వంతెనలు దిగువ విధంగా ఉండాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ► చూడ్డానికి అందంగా..ఆకర్షణీయంగా ఉండాలి. ► హైదరాబాద్ వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించాలి. ► మూసీ వంతెనలపై నుంచి పరిసర ప్రజలకు సాఫీ ప్రయాణం సాగాలి. ► వివిధరోడ్లపై ట్రాఫిక్ సాఫీగా సాగేలా ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్. ► వీటి వినియోగం వల్ల మేజర్ కారిడార్లలో కూడా ట్రాఫిక్ నిర్వహణ మెరుగవ్వాలి. ► ప్రయాణ దూరం, ఇంధన ఖర్చు తగ్గాలి. ► బ్రిడ్జిలకు సమీపంలో వాణిజ్య సంస్థలు అభివృద్ధి చెందాలి. ఆస్తుల విలువ పెరగాలి. ► ఇతర ప్రధాన రహదారుల్లో కర్బన ఉద్గారాలు,ట్రాఫిక్ జామ్స్,ప్రయాణసమయం తగ్గాలి. ► పర్యాటకంగా అభివృద్ధి చెందాలి. చదవండి: బాబోయ్..ఇదేం రోడ్డు? వెళ్లాలంటేనే దడ పుడుతోంది! పాతవాటికి కూడా.. దాదాపు 54 కి.మీ. మేర ఉన్న మూసీపై కొత్తగా వచ్చే ఈ వంతెనలతోపాటు, పాత వంతెనలకు కూడా కొత్త సొగసులద్దనున్నారు. కొత్త వంతెనలు అందంగా కనిపించేందుకు తగిన వాస్తుశిల్ప డిజైన్లకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆర్ఎఫ్పీలు ఆహా్వనించారు. ఆర్కిటెక్చర్లో అనుభవజ్ఞులు, నిపుణులతోపాటు ఆర్కిటెక్చర్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. అంతేకాదు.. ఉత్తమ డిజైన్లతో ఎంపికైన వారికి మొదటి బహుమతికి రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతికి లక్ష రూపాయలు, మూడో బహుమతికి రూ.50వేలతోపాటు ముగ్గురికి కన్సొలేషన్‌గా రూ. 20వేల వంతున నగదు బహుమతులందజేయనున్నారు. సదుపాయం.. కొత్త బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే లంగర్‌హౌస్, పురానాపూల్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, తదితర ప్రాంతాల్లో రాకపోకలు సాగించేవారికి ఎంతో సదు పాయం కలుగుతుంది. మూసీలోకి మురుగునీరు చేరకుండా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. కొత్త వంతెనలు ఈ ప్రాంతాల్లోనే.. ♦ ఐకానిక్ వంతెన, అఫ్జల్‌గంజ్. ♦ మూసారాంబాగ్ వద్ద ♦ ఇబ్రహీంబాగ్ కాజ్‌వేపై మిస్సింగ్ లింక్ (కారిడార్ నెంబర్ 99) ♦ చాదర్‌ఘాట్ వద్ద ♦ సన్‌సిటీ– చింతల్మెట్ (పవర్ కారిడార్)మార్గంలో.. ♦ ఇన్నర్‌రింగ్‌రోడ్ –కిస్మత్‌పూర్‌లను కలుపుతూ.. ♦ బుద్వేల్ (ఐటీ పార్కులు, కనెక్టింగ్ రోడ్లను కలుపుతూ) ♦ హైదర్షాకోట్ – రామ్‌దేవ్‌గూడ ♦ మూసీపై అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు ♦ మూసీ దక్షిణ ఒడ్డును ఉప్పల్ లేఔట్‌ను కలుపుతూ కొత్త బ్రిడ్జి. దక్షిణ ఒడ్డును కలిపేలా లింక్ రోడ్డు. ♦ ప్రతాప్‌సింగారం–గౌరెల్లి మార్గంలో. -
పథకం ప్రకారమే పాక్, చైనా కయ్యం
న్యూఢిల్లీ: సరిహద్దు విషయంలో దాయాది దేశం పాకిస్తానే కాదు చైనా సైతం తరచూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, ఒక పథకంలో(మిషన్) భాగంగానే పాక్, చైనా సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఆయన సోమవారం 44 నూతన వారధులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ వారధులు ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్‌కు 7,000 కిలోమీటర్ల సరిహద్దు ఉందని తెలిపారు. భారత్‌కు ఇబ్బందులు కలిగించాలని ఉత్తర దిశ నుంచి పాకిస్తాన్, తూర్పు దిశ నుంచి చైనా ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నూతన బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వారు సులువుగా అక్కడికి చేరుకోగలుగుతారని వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాకిస్తాన్, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూనే భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించనున్న 450 మీటర్ల సొరంగ మార్గం నెచిపూ టన్నెల్ నిర్మాణానికి ఆయన ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌ను రాజ్‌నాథ్ ప్రశంసించారు. -
బ్రిడ్జి త్వరలో ప్రారంభం, అంతలోనే..
భోపాల్: భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్‌లోని ఓ బ్రిడ్జి కుప్పకూలింది. వైన్‌గంగా నదిపై సియోని జిల్లాలో 3.7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జి ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అధికారికంగా నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన 30, ఆగస్టు 2020 రోజునే బ్రిడ్జి కూలిపోవడం విశేషం. ఇక 150 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు నెల క్రితమే పూర్తి కావడంతో స్థానికులు దాని ద్వారా రాకపోకలు కూడా సాగించారు. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో జనం ఇళ్లకే పరిమితమైన వేళ బ్రిడ్జి కూలిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బ్రిడ్జి పిల్లర్లు నదిలోకి కుంగిపోవడంతో అది పేకమేడలా వైన్ గంగలోకి ఒరిగిపోయింది. (చదవండి: కుక్కకు బర్రె వాహనం: భారీ భద్రత!!) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో భాగంగా 1,సెప్టెంబర్ 2018 న దీని పనులు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాహుల్ హరిదాస్ దర్యాప్తునకు ఆదేశించారు. నిర్మాణంలో లోపాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక బ్రిడ్జి కూలిపోవడంతో సున్వారా, భీంఘర్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ పాల్ సింగ్ ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో నర్మదా నదీపరీవాహక ప్రాంతాల్లో కూడా తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదకర స్థాయిలో నర్మద ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో ఇప్పటివరకు రాష్ట్రంలోని 251 రిజర్వాయర్లలో 120 పూర్తిగా నిండిపోయాయి. (చదవండి: ‘వందల కోట్ల బ్రిడ్జి.. 29 రోజుల్లో కూలిపోయింది’) -
కొత్త బ్రిడ్జి వరకు బస్సులు నడపాలి
నాగార్జునసాగర్ : పుష్కర భక్తుల సౌకర్యార్థం కొత్తబ్రిడ్జి వరకు ఉచిత బస్సులు వెళ్లేలా చూడాలని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్‌లోని శివాలయం, సురికివీరాంజనేయ స్వామి ఘాట్లను సందర్శించారు. భక్తులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్న ఎస్పీ పైవిధంగా స్పందించారు. వెంటనే సాగర్ భద్రతను పరిశీలించే డీస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఘాట్లలోని అధికారులతో కలిసి కోఆర్డినేషన్ మీటింగులు జరపాలన్నారు.