పగలు తోడేస్తూ.. రాత్రి తోలేస్తూ.. | - | Sakshi
Sakshi News home page

పగలు తోడేస్తూ.. రాత్రి తోలేస్తూ..

Published Tue, Aug 13 2024 2:10 AM | Last Updated on Tue, Aug 13 2024 11:27 AM

-

అనుమంచిపల్లి స్టాక్‌ పాయింట్‌ నుంచి తరలింపు 

జగ్గయ్యపేట సమీపంలోని ఆటోనగర్‌లో డంపింగ్‌ 

రాత్రి వేళల్లో తెలంగాణకు చేరవేత

 స్థానికులకు అందని ఉచిత ఇసుక 

పట్టించుకోని అధికారులు

జగ్గయ్యపేట: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఆపేవారే కనబడకపోవడంతో సరిహద్దులు దాటిపోతోంది. ఉచిత ఇసుక పథకం అక్రమార్కుల జేబులు నింపుతోంది. మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ప్రభుత్వం ఇసుక స్టాక్‌ పాయింట్‌ నుంచి జూలై 8న ఇసుక విక్రయాలు ప్రారంభించింది. మొత్తం 81వేల టన్నుల ఇసుకను ఈ ప్రాంతంలోని లబ్ధిదారులకు ఇచ్చేందుకు టన్ను రూ.290 చొప్పున ధర నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు విక్రయిస్తోంది. ఇందు కోసం ఇక్కడ రెవెన్యూ, పంచాయతీ, ఎస్‌ఈబీ అధికారులను నియమించారు. ఇసుక ప్రారంభం నాటి నుంచి నేటి వరకు 16,800 మెట్రిక్‌ టన్నులు ఇసుక విక్రయించినట్లు అధికారులు చెబున్నారు. అయితే ఇందులో కొన్ని వందల టన్నులు తెలంగాణకు తరలినట్టు సమాచారం.

తెలంగాణకు తరలింపు ఇలా..
స్టాక్‌ పాయింట్‌ వద్ద కొందరు అక్రమార్కులు తెలంగాణకు అక్రమంగా ఇసుకను రవాణా చేసేందుకు ప్రత్యేక వ్యూహాలను రచించారు. ఈ ప్రాంతం తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో ఏ గ్రామం నుంచి చూసినా 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే తెలంగాణ సరిహద్దు గ్రామాలు కనిపిస్తాయి. దీంతో అక్రమార్కులు ఇసుకను సామాన్యులకు అందనీయకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. స్టాక్‌ పాయింట్‌ల వద్ద కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు 10 నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఇసుకను రహస్య ప్రదేశాలకు తరలిస్తారు.

అధికార పార్టీ నేత హవా?
స్టాక్‌ పాయింట్‌ వద్ద గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు తన హవా కొనసాగిస్తున్నారు. తన గ్రామంలో స్టాక్‌ పాయింట్‌ ఉండటంతో గ్రామానికి ప్రతి రోజు 30 ట్రాక్టర్ల ఇసుక తను చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేయడంతో అధికారులు కూడా ఆయనకు తలొగ్గి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక ఒక్కో ట్రాక్టర్‌ నుంచి సదరు నాయకుడికి రూ.200 ఇస్తున్నట్లు కూడా సమాచారం.

ఉదాసీనంగా అధికారులు..
అక్రమంగా తరలిపోతున్న ఇసుకను నియంత్రించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ముఖ్యంగా స్టాక్‌ పాయింట్‌ వద్ద అనుభవం లేని పంచాయతీ రాజ్‌, రెవెన్యూ అధికారులను నియమించడంతో కూపన్లు జారీ చేసి విషయంలో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వే బిల్లుపై 2 నుంచి 3 సార్లు ఇసుకను తీసుకువెళ్తున్నారు. కనీసం వీటి పర్యవేక్షణకు సిబ్బంది లేకపోవడంతో ప్రతి రోజు 20 నుంచి 80 టన్నుల ఇసుక అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఎస్‌ఈబీ అధికారులు సమాచారం ఇస్తే తప్ప నియంత్రణ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఏపీ ఇసుకకు మంచి డిమాండ్‌..
తెలంగాణలో మునేరు, కృష్ణా ఇసుకకు మంచి డిమాండ్‌ ఉంది. ఒక లారీ ఇసుక రూ.30వేలు నుంచి రూ.70వేల వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇసుక కొరత ఉండటంతో ఏపీ ఇసుక కోసం ధర ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

చెక్‌పోస్ట్‌లు ఉన్నా..
65వ నంబర్‌ జాతీయ రహదారి రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ వద్ద తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన ముక్త్యాల, గండ్రాయి, అన్నవరం గ్రామాల్లో చెక్‌ పోస్టులు ఉన్నప్పటికీ తూతూ మంత్రంగానే సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ముక్త్యాల చెక్‌ పోస్ట్‌ వద్ద సిబ్బంది ఉన్నప్పటికీ అనుమంచిపల్లి స్టాక్‌ పాయింట్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం వజినేపల్లికి ఓ ట్రాక్టర్‌ ఇసుకలోడు సిబ్బంది కనుచూపులోనే వెళ్లింది. సమీపంలోని తెలంగాణ బుగ్గ మాధవరం చెక్‌ పోస్ట్‌ ఉన్నప్పటికీ ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక తరలి వెళ్లడం గమనార్హం.

పగలు తోడేస్తూ.. రాత్రి తోలేస్తూ..1
1/1

పగలు తోడేస్తూ.. రాత్రి తోలేస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement