రేవంత్‌ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా? | KSR Comments On Land Issues In AP And Telangana | Sakshi
Sakshi News home page

రేవంత్‌ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?

Published Mon, Apr 7 2025 10:42 AM | Last Updated on Mon, Apr 7 2025 12:02 PM

KSR Comments On Land Issues In AP And Telangana

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం చెట్ల నరికివేత విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వందల ఎకరాల్లో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు ఏపీలో సుమారు 33 వేల ఎకరాలలో ఏటా మూడేసి పంటలు పండే పచ్చటి భూములను బీడులుగా మార్చి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా స్పందించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.

దేశ ప్రధానితోపాటు, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో పని చేసిన వారిలో కొందరు కూడా అమరావతి పేరుతో సాగుతున్న పర్యావరణ విధ్వంసానికి సహకరించే విధంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాన్ని బట్టి, నేతలను బట్టి, పార్టీలను బట్టి వ్యవస్థలు స్పందిస్తున్నాయా అన్న సందేహం రావడానికి ఇలాంటి ఘట్టాలు ఆస్కారం ఇస్తుంటాయి. కంచ గచ్చిబౌలి భూముల మీద స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనమే, పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా అసంతృప్తి తెలిపింది. ఈ రెండు ఉదంతాలకు సంబంధం ఉందో, లేదో తెలియదు. అయితే, రేవంత్ చేసిన తప్పిదం వల్ల దాని ప్రభావం న్యాయ వ్యవస్థపై పడి ఉండవచ్చా అన్నది కొందరి డౌటు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఇలాంటి కేసులు తనంతట తానే తీసుకున్నట్లు కనిపించలేదు. అన్ని కేసుల్లోనూ కింది కోర్టుల్లో విచారణ జరుగుతుండగా ఇలా స్పందిస్తుందా? అన్నది కొందరి ప్రశ్న.

తెలంగాణ  ప్రభుత్వం తొందరపాటు, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల నిరసనలు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల విమర్శల హోరు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ, స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి రావడం వంటి పరిణామాలను విశ్లేషించుకుంటే అన్ని వ్యవస్థలలో ఉన్న మంచితోపాటు లోపాలు కూడా కనిపిస్తాయని చెప్పాలి. కంచ గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దాంతో రేవంత్ సర్కార్‌కు కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అమ్మడమో, లేక లీజు పద్దతిపై ఆయా సంస్థలకు కేటాయించడమో, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమో చేయాలని తలపెట్టి ఆ దిశగా పావులు కదిపింది.

అయితే, ఇక్కడే రేవంత్ అనుభవరాహిత్యం వల్ల దెబ్బతిన్నారు. నిజంగానే ఆయన అక్కడ అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాలి. దానికి ముందు ఈ భూమిని అధీనంలోకి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలను పసికట్టి ఉండాలి. అది హైదరాబాద్ సెంట్రల్  యూనివర్శిటీలో భాగమా? కాదా? ఎవరికి భూములపై హక్కులు ఉన్నాయన్న దానిపై న్యాయపరంగా అభిప్రాయం తీసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో గాని, అలా కాకుండా, వేగంగా సెలవు దినాలలో పెద్ద సంఖ్యలో జేసీబీలను పంపించి చెట్లు కొట్టి, నేల చదును చేయించడంతో వివాదానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కొందరైతే ఇంకా ఎక్కువే వస్తుందని అంటారు. దీంతో ప్రభుత్వ కష్టాలు తీరుతాయని ఆశించి ఉండవచ్చు. సుమారు రెండు దశాబ్దాల పాటు కోర్టులలో ప్రభుత్వమే ఈ భూమిపై పోరాడింది కనుక తమవే అన్న అభిప్రాయం వచ్చినప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఒక అంచనాకు రావడంలో విఫలమైందని అనిపిస్తుంది.

1975లో రాష్ట్ర  ప్రభుత్వమే 2300 ఎకరాలు  కేటాయించినా, సెంట్రల్ యూనివర్శిటీకి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినా వారు వాడుకున్న భూమి పోను మిగిలినది ప్రభుత్వ అధీనంలోనే ఉందట. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని  ‘ఐఎమ్‌జీ భారత’ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించింది. ఆ సంస్థకు భూమిని బదలాయించే నిమిత్తం 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 534 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి బదలాయించారు. ఈ మేరకు రికార్డులు ఉన్నాయని మీడియా కథనం. అందులో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండడం గమనార్హం. విశేషం ఏమిటంటే  చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం హోదాలో ఈ భూమిని ఇలా బదలాయించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఏ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు రాలేదు. పైగా ఈ భూమిలో 400 ఎకరాలు పొందిన ప్రైవేటు సంస్థ రెండు దశాబ్దాలుగా ఆ భూమి తనదే అంటూ కోర్టులలో వ్యాజ్యాలు సాగించినా ఏ వ్యవస్థ సీరియస్ గా తీసుకున్నట్లు  కనిపించదు.

ఇక, 2006లో ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ భూమి విషయాన్ని పరిశీలించి ఇది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేసేందుకే చంద్రబాబు సర్కార్ కేటాయించిందని అభిప్రాయపడి దానిని రద్దు చేసింది. అయినా కోర్టులో అది ప్రభుత్వ భూమి అని ఇంతకాలం పోరాడాల్సి వచ్చింది. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఐఎంజీ సంస్థ ఏవైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఏమై ఉండేది అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అప్పుడు కూడా ఈ భూమిలో చెట్లు ఉన్నాయి కదా!. అలాంటి ఖాళీ భూమిలోనే కదా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అప్పుడు పర్యావరణ సమస్యలు రావా? ఇక్కడ రేవంత్ సర్కార్ కరెక్ట్ గా చేసిందా? లేదా? అన్నది చర్చ కాదు. కానీ, పరిణామాలన్నిటిని విశ్లేషించినప్పుడు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా!. సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చిన తర్వాత ఈ భూమిని అభివృద్ది చేయడం కోసం మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించింది. ఈ పనులు చేయడం కోసం ఇదే భూమిని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా పదివేల కోట్ల అప్పు కూడా తీసుకుందట. మార్కెట్‌లో బాండ్లు, వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా ఈ రుణాలు సేకరించి, వడ్డీ కట్టడం కూడా ఆరంభమైందని కథనం.

ఈ భూమిని యూనివర్శిటీకే ఇవ్వాలని, అక్కడ ప్రహరి గోడ కట్టించడం వల్లే వృక్షాలు పెరిగాయని చెబుతూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడం, తదుపరి విపక్షాలు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎంటర్ అవ్వడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఈలోగా కేంద్రం కూడా స్పందించి ఈ భూమిపై నివేదికను కోరింది. తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది. ఇంతలో సుమోటోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని చెట్లు కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఆపాలని ఆదేశించింది. దీంతో విద్యార్దులు తామే గెలిచామని సంబరాలు చేసుకుంటే, రేవంత్ సర్కార్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఇప్పుడు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. కాగా అక్కడ పర్యావరణ అనుకూల పార్కు ఏర్పాటు చేస్తామని, యూనివర్శిటీ కూడా అదే భూమిలో ఉంది కనుక దానిని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని కొత్త కండీషన్ పెట్టడం విశేషం. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ద్వారా కల్పిత వీడియోలు సృష్టించారని తెలంగాణ సర్కార్ ఇప్పుడు వాపోతున్నా పెద్దగా ఫలితం ఉంటుందా అన్నది సందేహం.

కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావని రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఎంకు సంయమనం పాటించడం తెలియదా అని ప్రశ్నించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే ఆయన అనవసర వివాదంలో చిక్కుకున్నారని అనుభవజ్ఞులు అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను సవాల్ చేసేలా ఆయన మాట్లాడడం వారికి ఎలా నచ్చుతుంది. గతంలో ఫిరాయింపులపై కోర్టులు గట్టి చర్యలు తీసుకోలేదన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ శాసనసభలో అలా మాట్లాడి దెబ్బతిన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. విశేషం ఏమిటంటే యూనివర్శిటీకి చెందిన భూములలో కొంత భాగం ఆక్రమణలకు గురైందని చెబుతున్నారు. తన అధీనంలో ఉన్న భూములను ఏం చేయాలన్నది నిజానికి ప్రభుత్వ అభీష్టం ప్రకారం జరగాలి. అయితే స్థానిక ప్రజలు పర్యావరణ వేత్తలు, యూనివర్శిటీ విద్యార్ధులు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఉండవచ్చు. అవేవి జరగలేదు. దానిని సహజంగానే  విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి.

ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మడం కొత్త కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు  ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల కారణం చూపి అమ్ముతున్నారు. తెలంగాణలో గత కేసీఆర్‌ ప్రభుత్వం కూడా పలు చోట్ల భూములను అమ్మి వేల కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడేమో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ తాము అధికారంలోకి వస్తే ఈ భూములను యూనివర్శిటీకి అప్పగిస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌ సర్కార్ భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు ఆయన అదే బాటలో ఉన్నారు. ఇదంతా ఒక గేమ్‌గా మారింది. ప్రతిపక్షంలో ఉంటే ఒకరకం, అధికారంలోకి వస్తే  మరో రకంగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఏపీ సంగతి కూడా చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. కృష్ణానది పక్కన 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించి రాజధాని కడుతున్నారు. అది పర్యావరణానికి నష్టమని పలువురు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ భూమి స్వభావ రీత్యా మామూలు వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల అధికంగా నిర్మాణ ఖర్చు అవుతుందట. రిషికొండపై జగన్ ప్రభుత్వం మంచి భవనాలు నిర్మిస్తే, ప్యాలెస్‌లని ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు అమరావతిలో అంతకన్నా పెద్ద ప్యాలెస్‌లు నిర్మించాలని తలపెట్టారు. వాటికి మాత్రం ఐకాన్ భవనాలని, అదని, ఇదని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు స్వయంగా కృష్ణా నది తీరాన నదీ చెంత సీఆర్‌జెడ్‌ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఒక భవనంలో నిర్మిస్తున్నా ఏ వ్యవస్థ ఆయన జోలికి వెళ్లలేకపోయింది.

రిషికొండపై అంతా కలిపి 400 కోట్లతో భవనాలు నిర్మిస్తే తప్పట. అదే  అమరావతిలో ఏభై వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ ప్యాలెస్‌లు నిర్మిస్తే రైటట. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థలే  లేవా?. రాజధాని కోసం ఎంత భూమి అవసరమో అంత తీసుకోవచ్చు. అలా కాకుండా మహానగరం నిర్మిస్తామంటూ శివరామకృష్ణన్ నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలా చేస్తుంటే ఏమనాలి?. తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం ఉంటుందా?. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో సహా వివిధ వ్యవస్థలలో ఉన్న లోపమా?.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement