
ఆంధ్రప్రదేశ్ కూటమి భాగస్వాములు టీడీపీ, జనసేనల మధ్య అంతా బాగానే ఉందా? లేక ఎవరికి వారు తమదైన రాజకీయ క్రీడలు ఆడేస్తున్నారా? ఈ అనుమానం ఎందుకొస్తోందంటే.. ఒకపక్క సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్.. పవన్ కళ్యాణ్‌ను అతిగా పొగిడేస్తూంటే.. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూండటం!. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడంటూ పలు కార్యక్రమాల్లో ప్రశంసిస్తూండటం.. ఏదో తేడా కొడుతున్నట్టుగానే ఉంది రాజకీయ విశ్లేషకులకు! ఇప్పటికిప్పుడు ఇరు పార్టీల్లో పెద్ద విభేదాలేవీ స్పష్టం కాకపోయినప్పటికీ పిఠాపురం వ్యవహారం మాత్రం వివాదాల్లోనే ఉంటోంది.
జనసేన గెలిచిన ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్థానిక నేతలు తాము చెప్పిన వారికే పనులు చేయాలని ఏకంగా లేఖలు రాస్తుండటం కూడా ఇరు పార్టీల మధ్య సయోధ్యపై ప్రశ్నలు విసురుతోంది!. అక్కడ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పవన్ టీడీపీపై ఒత్తిడి చేయగలిగారని అంటారు. అంతేకాక తన బదులు నాగబాబును నియోజకవర్గంలో తిప్పుతూ ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మకు అసలు విలువ ఇవ్వడం లేదు. దాంతో రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. నాగబాబుకు అసాధారణ స్థాయిలో పోలీసులు భద్రత కల్పించడం కూడా ఆసక్తికరమైన విషయమే. రెండు వర్గాల మధ్య ఏదైనా గొడవ చెలరేగితే వచ్చే ఇబ్బందుల రీత్యా ఇలా చేసి ఉండవచ్చు.

నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేత తాము చెప్పినవారికే పనులు చేయాలని అధికారులకు ఉత్తరం రాయడం విశేషం. ఇక్కడే కాదు. ఆయా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా, పెత్తనం టీడీపీ వారే చేస్తున్నారన్నది జనసేన కేడర్‌లో బాధగా ఉంది. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే, సమస్య ఏమిటో తెలుసుకోకుండా జనసేన అధిష్టానం తన పార్టీ నేతనే మందలించిందన్న వార్తలు వచ్చాయి. రాజకీయాలలో ఇవన్ని సాధారణంగా జరిగేవే. అయినా ఒక్కొక్కటిగా గొడవలు పెరుగుతూ, ఆ తర్వాత రోజులలో అవే పెద్దవిగా మారుతుంటాయి.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత పవన్ కళ్యాణ్, లోకేశ్‌ల మధ్య స్నేహం పెరిగిన మాట నిజమైనా.. ఎన్నికల తరువాత మాత్రం వీరిద్దరూ అంటీ అంటనట్టుగానే ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత లోకేశ్ ఒకరకంగా పవన్ కళ్యాణ్‌ను అవమానించేలా వ్యాఖ్యానించారు కూడా. టీటీడీ అధికారులు, ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే, అది ఆయన పార్టీ అభిప్రాయం అని లోకేశ్ తీసిపారేశారు. చైర్మన్‌తో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పించారు తప్పితే పవన్ కోరినట్లు అధికారులపై ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు. క్షమాపణలు కూడా చెప్పించ లేదు. పవన్ కళ్యాణ్ వద్ద పనిచేసే అధికారుల నియామకం విషయంలో కూడా లోకేశ్ జోక్యం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దానిపై పవన్ ఢిల్లీలో కూడా నిరసన చెప్పారని కథనాలు వ్యాపించాయి.
అటవీ శాఖకు చెందిన భూమిలో ఉందన్న సాకుతో కాశీనాయన ఆశ్రమంలో భవనాలు కూల్చిన ఘటనపై పవన్ మాట్లాడ లేదు కానీ, లోకేశ్ క్షమాపణ చెప్పడం విశేషం. నిజానికి లోకేశ్‌కు జనసేనతో పొత్తు అంత ఇష్టం లేదని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. దానికి తగినట్లే పవన్‌కు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండదని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పాలిట్‌బ్యూరో నిర్ణయమని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయినా పవన్ సర్దుకుపోయారు. బీజేపీ వారు ఏభై సీట్లు డిమాండ్ చేయమని సూచించినా, పవన్ పట్టుబట్టలేదు. పైగా టీడీపీకి చెందిన వారికే కొందరికి తన పార్టీ టిక్కెట్లు ఇచ్చి చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు.

2017 ప్రాంతంలో లోకేశ్‌పై పవన్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసినా 2020 నాటికి రాజీపడిపోయి చంద్రబాబుతో చేతులు కలిపారు. 2024లో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్‌ల కన్నా లోకేశ్ పవర్ఫుల్ అయ్యారన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. తాను కూడా అలాగే ఇతర శాఖలలో జోక్యం చేసుకోవాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, పౌర సరఫరాల శాఖలో వేలు పెట్టి ‘సీజ్ ద షిప్’ అని అధికారులను ఆదేశించి పవన్ నవ్వులపాలయ్యారు. చంద్రబాబు, పవన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ఇంతవరకు కనిపించలేదు కానీ.. లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అంశంలో పవన్ అభ్యంతరం చెప్పారని రెండు పార్టీలలో గుసగుసలు వినిపించాయి. అందువల్లే లోకేశ్ కోరిక తీరలేదని అంటారు. ఇప్పటికే లోకేశ్‌ను సీఎంను చేయాలని చంద్రబాబుపై కుటుంబపరంగా ఒత్తిడి ఉందని చెబుతారు. అయినా పవన్ కళ్యాణ్ నుంచి సమస్య వస్తుందని చంద్రబాబు సర్ది చెబుతుండవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
ఇక, ఇది నిజమా? కాదా? అన్నది చెప్పలేం కానీ.. పవన్ కళ్యాణ్ ఆయా సభలలో చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని, ఆయన సమర్థుడని, అనుభవజ్ఞుడని పనికట్టుకుని పొగుడుతున్న తీరు లోకేశ్ అనుచరులకు మింగుడుపడటం లేదనిపిస్తుంది. కేవలం లోకేశ్‌ను సీఎం కానివ్వకుండా, లేదా డిప్యూటీ సీఎం ప్రమోషన్ రానివ్వకుండా చూడడానికి పవన్ ప్రకటనలు ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ వ్యూహం మార్చి తన ప్రమోషన్‌కు పవన్ కళ్యాణ్ నుంచి ఆటంకం లేకుండా ఉండడానికి ప్రయత్నాలు ఆరంభించారా అన్న సందేహం కలుగుతుంది. కొన్నాళ్లుగా లోకేశ్ తనకు సంబంధం లేని శాఖలలో కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. ఆ సభలలో ఒకటికి రెండుసార్లు 'పవనన్న, పవనన్న’ అని ప్రస్తావిస్తూండటం.. ‘పవనన్న పట్టుబడితే సాధించి తీరుతారని, కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తున్నారని’ పొగడ్తలు కురిపిస్తున్నారు.
గతంలో ఇలాంటి ప్రోగ్రాంలను చంద్రబాబు వదలి పెట్టేవారు కారు. ఇప్పుడు తన కుమారుడి ఆధిపత్యానికి ఆయన అడ్డు చెప్పడం లేదు. దాంతో టీడీపీ మంత్రులు లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రకాశం, అనకాపల్లి జిల్లాలలో లోకేశ్ పర్యటనలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు తర్వాత పెత్తనం ఎటూ లోకేశ్‌దే కనుక ఇందులో పెద్దగా ఆక్షేపించవలసింది ఉండకపోవచ్చు. పార్టీ పరంగా అయితే ఏమైనా చేసుకోవచ్చు కాని, ప్రభుత్వ పరంగా లోకేశ్ ఇలా పెత్తనం చెలాయించడం కరెక్టేనా అన్న చర్చ వస్తుంది.
మరోవైపు, పవన్ కళ్యాణ్ మాత్రం సభలలో చంద్రబాబునే పొగుడుతూ, లోకేశ్‌ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అయినప్పటికీ లోకేశ్ బుజ్జగించి పవన్‌ను తన దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చన్నది పలువురి భావన. పదిహేనేళ్లు కలిసి ఉండాలని అనుకుంటున్నప్పుడు మరీ తేడా ఏదైనా వస్తే తప్ప భవిష్యత్తులో లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించక తప్పని స్థితి పవన్‌కు వస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు ఇప్పటికే 74 ఏళ్లు వచ్చినందున భవిష్యత్తులో ఆ పరిణామం జరగవచ్చు. లోకేశ్ మరో మాట కూడా చెబుతున్నారు.
టీడీపీ, జనసేనల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కూర్చుని పరిష్కరించుకుంటాము తప్ప వేరు పడబోమని అన్నారు. ఇది కూడా గమనించవలసిన అంశమే. రాజకీయాలలో పైకి ఒకటి చెబుతారు. లోపల జరిగేవి వేరుగా ఉంటుంటాయి. అలాగే పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతూ, కలిసి ఉన్నట్లు కనిపిస్తూనే ఎవరికి వారు పైచేయి తెచ్చుకునేందుకు యత్నించినా ఆశ్చర్యం ఉండదు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.