
సాక్షి, చైన్నె: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ పొత్తులు, కీలక నేతల పోటీ విషయంలో ఆసక్తి నెలకొంది. ఇక, సినీ నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు.
తమిళనాడులో 2026 ఎన్నికలలో విజయ్ తమిళగ వెట్రి కళగం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. తమిళగ వెట్రి కళగం నేత విజయ్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన్ని సీఎం చేయడమే లక్ష్యంగా రంగంలోకి ప్రశాంత్ కిషోర్ దిగారు. గత వారం జరిగిన విజయ్ పార్టీ రెండో ఆవిర్భావ వేడుక వేదికపై ప్రశాంత్ కిషోర్ సైతం కూర్చున్నారు. ప్రత్యేక ప్రసంగం కూడా చేశారు.
2026లో విజయ్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా తన సహకారం, మద్దతును ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు శనివారం వైరల్ అయ్యాయి. 2026 ఎన్నికలలో విజయ్ పార్టీ అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్న చర్చకు ముగింపు పలికే విధంగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అన్నాడీఎంకేతో విజయ్ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటారని, ఆ దిశగానే వ్యూహ రచనలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఒంటరిగానే తన బలాన్ని చాటి, అధికారం చేజిక్కించుకునే దిశగా ముందుకెళ్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ పేర్కొనడం గమనార్హం.