సాక్షి, చెన్నై: కరోనా వైరస్ భయంతో ప్రజలంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దాదాపుగా మరిచిపోయారు. అయితే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు మాత్రం ప్రణాళికలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను డీఎంకే నియమించుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే సైతం డీఎంకే మాజీ రాజకీయ వ్యూహకర్త సునీల్‌తో జతకట్టనుంది. కరోనాకు కళ్లెం వేయగానే ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు ఇరు పార్టీలూ సిద్ధం అవుతున్నాయి. రాజకీయ పార్టీల్లో కార్యకర్తలపై విశ్వాసం పెట్టుకునే రోజులు అంతరించిపోగా ఐటీ రంగ నిపుణుల సలహాలు, సూచనలతో ఎన్నికల బరిలోకి దిగేలా మార్పులు చోటుచేసుకున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేకు సునీల్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. సునీల్ మార్గదర్శకంలోనే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు ఆ పార్టీ కూడా నడిచింది.
సునీల్ సలహా మేరకే స్టాలిన్ ‘నమక్కు నామే’ పేరున పాదయాత్ర సాగిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోకపోయినా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా డీఎంకే అవతరించింది. అదే బాణిని అనుసరించి లోక్‌సభ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. అయితే 21 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునీల్ వ్యూహం డీఎంకేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఉప ఎన్నికల్లో అత్యధిక సీట్లను కొల్లగొట్టడం ద్వారా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోసి డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశలు అడియాసలయ్యాయి. దీంతో సునీల్, డీఎంకే బంధానికి బీటలువారాయి. డీఎంకేకు సునీల్ దూరం అయ్యారు. డీఎంకే సైతం ఇచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకుంది. డీఎంకేకు ఘనవిజయం సాధించిపెట్టడం ద్వారా స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం. చదవండి: భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఢీకొట్టేందుకు అన్నాడీఎంకే సైతం అడుగులు వేయడం ప్రారంభించింది. ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా డీఎంకే నుంచి వైదొలగిన సునీల్‌ను రాజకీయ వ్యూహకర్తగా అన్నాడీఎంకే నియమించుకుంది. సునీల్ సూచనల మేరకే అన్నాడీఎంకే ఐటీ విభాగాన్ని ప్రక్షాళన చేసినట్లు సమాచారం. గత ఐటీ విభాగం వారు ఎలాంటి వ్యూహకర్తలు లేకుండానే 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత విజయం సాధించేందుకు సహకరించారు. జయ హయాంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఐటీ విభాగం సహకారంతో అన్నాడీఎంకేను మరోసారి అధికారంలో కూర్చొనబెట్టేందుకు సునీల్ రంగప్రవేశం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడగానే అన్నాడీఎంకే, డీఎంకేలు తమ వ్యూహాలతో ప్రజాక్షేత్రంలో వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment