
Fans Worry About Cheteshwar Pujara Batting: టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు టెస్టుల్లో 'ది వాల్' అని పేరు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నోసార్లు తన జిడ్డు ఇన్నింగ్స్‌లతో టీమిండియాను టెస్టుల్లో ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఇక ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత అలాంటి అడ్డుగోడ మరొకటి కనిపించలేదు. అయితే 2010లో టీమిండియా టెస్టు జట్టులోకి ఒక ఆటగాడు వచ్చాడు. మొదట్లో అతను జిడ్డు బ్యాటింగ్.. ఓపికతో ఆడడం చూసి కొన్నాళ్ల ముచ్చటే అనుకున్నారు. కానీ రానురాను మరింత రాటుదేలిన ఆ ఆటగాడు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర వేసుకున్నాడు.
చదవండి: Dravid-Pujara: 'గోల్డెన్ డక్'.. ద్రవిడ్‌కు ఎదురుపడిన పుజారా; రియాక్షన్ అదుర్స్
పరిమిత ఓవర్ల ఆటకు దూరంగా ఉన్న అతను అప్పటినుంచి టీమిండియా టెస్టు జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. కెరీర్ ఆరంభంలోనే టెస్టుల్లో ద్రవిడ్ మూడోస్థానాన్ని తీసుకొని తనదైన జిడ్డు ఆటతో మరో అడ్డుగోడలా తయారయ్యాడు. ఇన్నాళ్లకు ద్రవిడ్‌కు వారసుడు వచ్చాడు అని ఫ్యాన్స్ కూడా సంతోషంలో మునిగితేలారు. మాకు మరో వాల్ దొరికాడంటూ ఫ్యాన్స్ అంతా సంబరపడిపోయారు. ఆ ఆటగాడే చతేశ్వర్ పుజారా.
చదవండి: Cheteswar Pujara: అప్పుడు 'గోల్డెన్' రనౌట్.. ఇప్పుడు 'గోల్డెన్' డక్
2010లో టీమిండియాలో అడుగుపెట్టిన పుజారా 10 ఏళ్ల కెరీర్‌లో 90 టెస్టులాడి 6494 పరుగులు సాధించాడు. ఇందులో 18 టెస్టు సెంచరీలు.. 31 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇందులో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇటీవలే పుజారా తన ఫామ్‌ను కోల్పోయి తంటాలు పడుతున్నాడు. చివరగా 2019 జనవరిలో సెంచరీ చేసిన పుజారా అప్పటినుంచి వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. గత పది టెస్టుల్లో పుజారా చేసిన స్కోర్లు 0, 47, 0, 22, 26, 61, 4, 91, 1, 45గా ఉన్నాయి. 2019 నుంచి చూసుకుంటే పుజారా 26 టెస్టుల్లో 1356 పరుగులు చేశాడు. ఇందులో కేవలం 2019 జనవరిలో ఆసీస్ గడ్డపై చేసిన 193 పరుగులు మాత్రమే ఉన్నాయి. అంటే 2019 జనవరి తర్వాత పుజారా బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ రాలేదంటే అతని బ్యాటింగ్ ప్రమాణాలు ఉలా ఉన్నాయో అర్థమయ్యే ఉంటుంది. ఈ రెండేళ్లలో సెంచరీ చేయకపోగా రెండు గోల్డెన్ డక్‌లు.. రెండు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉండడం విశేషం. ప్రత్యర్థి జట్లకు అడ్డుగోడగా తయారవ్వాల్సిన పుజారా ఇప్పుడు సొంతజట్టుకే అడ్డుగోడగా మారిపోయాడు.
ఈ నేపథ్యంలోనే టీమిండియా అభిమాని ఒకరు పుజారాను ఒకే ఒక్క పదంలో వివరిస్తూ తన ట్విటర్‌లో ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోలో వికెట్లకు ముందు ఒక బండరాయి.. ఇంకో ఫోటోలో వికెట్ల వెనకాల బండరాయి ఉంటుంది. 2019కు ముందు పుజారా.. 2021లో పుజారా అనేది దీనర్థం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అడ్డుగోడకు ఈరోజు ఏమైంది.. మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా రాడా అని కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు