
నటరాజన్ కూతురితో ధోని సరదా సంభాషణ (PC: CSK Twitter)
IPL 2023 CSK Vs SRH- MS Dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానించని క్రికెట్ ప్రేమికులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. మైదానంలో తనదైన బ్యాటింగ్, కెప్టెన్సీ వ్యూహాలతో ఆకట్టుకునే ధోని.. ఒక్కసారి ఆట ముగిసిందంటే పూర్తిగా సాధారణ వ్యక్తిలా మారిపోతాడు. చిన్నాపెద్దా తేడా లేకుండా అభిమానులతో కలిసిపోయి ఉల్లాసంగా గడుపుతాడు ఈ టీమిండియా మాజీ సారథి.
ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనికి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలైవా అంటూ ధోనిపై అభిమానం చాటుకునే తమిళ తంబీలలో టీమిండియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్ కూడా ఉన్నాడు.
ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ మ్యాచ్ నేపథ్యంలో నటరాజన్ కుటుంబం ధోనిని కలిసింది. ఈ క్రమంలో తన చిన్నారి కూతురిని నట్టూ.. ధోనికి పరిచయం చేయగా.. తలా ఆ బుజ్జాయితో సరదాగా ముచ్చటించాడు.
నాకూ కూతురు ఉంది
హై ఫై ఇవ్వాలంటూ పాపను అడుగగా.. తను మాత్రం చేతులు వెనక్కి పెట్టుకుంది. తను భయపడుతోందని భావించిన ధోని.. చిరునవ్వులు చిందిస్తూ.. ‘‘నాకూ ఓ కూతురు ఉంది.. తను కూడా నీలాగే ఉంటుంది’’ అంటూ బుడ్డదాన్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశాడు.
అక్క ఏది.. తంబీ లేడా?
అయినప్పటికీ నటరాజన్ కూతురు.. ‘‘అక్క ఏది.. తంబీ లేడా..’’ అని ప్రశ్నలు కురిపించిందే తప్ప.. మిస్టర్ కూల్ దగ్గరికి మాత్రం వెళ్లలేదు. దీంతో ధోని సరే మరి ఇక అంటూ నటరాజన్ కుటుంబంతో ఫొటో దిగి అక్కడి నుంచి కదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే.. ‘‘కుట్టీ చట్టీస్‌తో ఇలా ఉంటది’’ అంటూ షేర్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది.
తప్పు చేశావు కుట్టీ.. వామిక పాపను ఎప్పుడు చూస్తామో!
ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘అందుకే ధోనిని మిస్టర్ కూల్ అనేది. చిన్నపిల్లలతోనూ ఇట్టే కలిసిపోతాడు. నువ్వు సూపర్ తలైవా’’ అని కొనియాడుతున్నారు. ఇక నటరాజన్ కూతురిని ఉద్దేశించి.. ‘‘తప్పు చేశావు కుట్టీ.. కాస్త పెద్దయ్యాక.. ‘‘అయ్యో ఆరోజు ధోని సర్‌కు ఎందుకు హై ఫై ఇవ్వలేకపోయానే అని బాధపడతావు’’..
ఏదేమైనా ధోనితో సరదాగా సమయం గడిపే అవకాశం నీకు దక్కింది. వామిక పాప(విరాట్ కోహ్లి కూతురు)ను ఎప్పుడిలా చూస్తామో’’ అని ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ నటరాజన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
చదవండి: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. ఒకే ఒక్కడు! దరిదాపుల్లో ఎవరూ లేరు
ఒక్క బంతి కూడా వేస్ట్ చేయలేదు... ఇది బాలేదు అని చెప్పడానికి ఏమీలేదు!
A dose of kutty chutties to make your day! 🦁💛#CSKvSRH #WhistlePodu #Yellove #IPL2023 @Natarajan_91 pic.twitter.com/Fx4gywH6aW
— Chennai Super Kings (@ChennaiIPL) April 22, 2023