
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 7) మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో (వాంఖడే స్టేడియంలో) ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుండగా.. వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ కాస్త ఢీలాగా కనిపిస్తుంది.
అయితే నేటి మ్యాచ్‌లో ముంబైకి కూడా జోష్ రావచ్చు. ఈ మ్యాచ్‌తో వారి తరుపుముక్క జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఆర్సీబీ మ్యాచ్‌తోనే పునరాగమనం చేయనున్నాడు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మరో శుభవార్త కూడా ఉంది.
గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ కూడా నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. బుమ్రా, రోహిత్ చేరికతో ముంబై ఇండియన్స్‌లో కొత్త జోష్ వచ్చింది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి మూడింట ఓడింది. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడింది.
ముంబైదే పైచేయి
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీపై ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై 19, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
ముంబైతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. నేటి మ్యాచ్‌లో విరాట్ మరో 17 పరుగులు చేస్తే టీ20ల్లో 13000 పరుగుల మైలురాయిని తాకుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12983 పరుగులు (385 ఇన్నింగ్స్‌ల్లో 41.47 సగటున) ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడు.
విరాట్ టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేస్తే ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో క్రిస్ గేల్ (455 ఇన్నింగ్స్‌ల్లో 14562 పరుగులు), అలెక్స్ హేల్స్ (490 ఇన్నింగ్స్‌ల్లో 13610), షోయబ్ మాలిక్ (514 ఇన్నింగ్స్‌ల్లో 13557), కీరన్ పోలార్డ్ (617 ఇన్నింగ్స్‌ల్లో 13537) మాత్రమే విరాట్ కంటే అత్యధిక పరుగులు చేశారు.
ప్రస్తుత సీజన్‌లో విరాట్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (59 నాటౌట్) చేసిన అతను.. సీఎస్‌కేపై (31) పర్వాలేదనిపించి, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో (7) విఫలమయ్యాడు. కేకేఆర్ మ్యాచ్‌లో విరాట్ ఆర్సీబీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. విరాట్ ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. విరాట్ ఐపీఎల్‌లో 247 ఇన్నింగ్స్‌లు ఆడి 8101 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బవా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్
ఆర్సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ