
గత ఏడాది కంటే స్వల్ప తగ్గుదల
ఆదాయం మాత్రం కొంత పెరిగింది
ఇక నుంచి ‘బిల్డ్ నౌ’ ద్వారానే దరఖాస్తుల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో 13,641 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో అవి 13,421కి తగ్గాయి. అయినప్పటికీ ఆదాయం మాత్రం కొంత పెరిగింది. క్రితంసారి రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.1138.44 కోట్ల ఆదాయం సమకూరింది.
హై రైజ్ భవనాలు (High-rise buildings) సైతం క్రితం కంటే తగ్గాయి. క్రితంసారి 130 హై రైజ్ భవనాలకు అనుమతులు జారీ కాగా.. ఈసారి 102 హై రైజ్ భవనాలకు మాత్రమే అనుమతులు జారీ అయ్యాయి. హై రైజ్ భవనాల్లో ఇనిస్టిట్యూషనల్ భవనాలు, ఆస్పత్రుల వంటివి మాత్రం గతం కంటే ఈసారి పెరిగాయి. గతంలో అలాంటివి కేవలం 12 మాత్రం ఉండగా, ఈసారి 46కు పెరిగాయి. దీంతో ఆదాయం (income) పెరిగింది.
50 అంతస్తుల భవంతికి అనుమతి
తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొండాపూర్‌లో జీ+49 అంతస్తులతో 50 అంతస్తుల నివాస భవనానికి అనుమతులు జారీచేశారు. 165.95 మీటర్ల ఎత్తుతో 8 టవర్లుగా ఈ నిర్మాణానికి అనుమతులు జారీ అయినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
నేటి నుంచి ‘బిల్డ్ నౌ’’
జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల్ని మరింత సరళీకరించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘బిల్డ్ నౌ’ (BuildNow) పోర్టల్ ద్వారానే కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ కె. శ్రీనివాస్ తెలిపారు. భవన నిర్మాణాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారంతా ‘బిల్డ్ నౌ’లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇటీవలే దీన్ని సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించడం తెలిసిందే.
వ్యక్తిగత నివాస భవనాలు 75 చదరపుగజాల్లోపు ఇళ్లకు ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్, పదిమీటర్ల లోపు ఎత్తు, 500 చదరపు గజాల్లోపు వాటికి ఇన్‌స్టంట్ అప్రూవల్ ఇస్తారు. అంతకు మించిన వాటికి సింగిల్‌విండో ద్వారా అనుమతులు జారీ చేస్తారు.