
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ
సమస్యల పరిష్కారంపై జిల్లా న్యాయవ్యవస్థలో చర్చ జరగాలి: ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్
రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో జిల్లా న్యాయ వ్యవస్థపై సదస్సు
పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా జడ్జీలు, రిజిస్ట్రార్లు
సాక్షి, హైదరాబాద్: వ్యక్తులుగా కంటే వ్యవస్థగా పనిచేస్తేనే సమ స్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ అభి ప్రాయపడ్డారు. స త్ప్రవర్తన, శాస్త్రీయ ఆలోచన, అధ్యయన శక్తి, కష్టపడేతత్వం, గడు వులోగా బాధ్యతలు పూర్తి చేయగల నేర్పు న్యాయమూర్తులు అల వర్చుకోవాల్సిన సూత్రాలని పేర్కొన్నారు. తెలంగాణ న్యాయ మూర్తుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర జ్యుడీషియల్ అకా డమీలో జిల్లా న్యాయ వ్యవస్థపై శనివారం సదస్సు జరిగింది.
ఈ సదస్సు కు జస్టిస్ పీఎస్ నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘వ్యవస్థ అంటే ఓ ఆలోచన. వ్యక్తులు ఉన్నా లేకున్నా ముందుకు వెళ్లేలా వ్యవస్థ బలపడాలి. వివాదాల పరిష్కారానికి న్యాయ స్థానం ఓ వ్యవస్థగా కదలాలి. జిల్లా కోర్టులకు వచ్చే అప్పీళ్లపై జడ్జీలు న్యా య వాదులతో మాట్లాడి మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్క రించే ప్రయత్నం చేయాలి’ అని జస్టిస్ నరసింహ సూచించారు.
వ్యవస్థలో భాగం కావాలి..
న్యాయవాదిగా ఉన్న తాను అనుకోకుండా సుప్రీంకోర్టు జడ్జిని అయ్యానని జస్టిస్ నరసింహ గుర్తుచేసుకున్నారు. జడ్జీలు వ్యక్తిగా అంతర్ధానమై.. వ్యవస్థగా ప్రత్యక్షం కావాలని సూచించారు. అకా డమీలో న్యాయవాదులను భాగస్వాములను చేయాలని.. కేసుల సత్వర పరిష్కారం దిశగా ప్రయత్నించాలన్నారు. హైకోర్టు ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్ మాట్లాడుతూ జిల్లా న్యాయవ్యవస్థలో సమస్యల పరిష్కారంపై చర్చ జరగాలన్నారు. ఒకసారి జరిగిన తప్పును పునరావృతం కానీయరాదని సూచించారు.
నవ్వులు పూయించిన జస్టిస్ కె.లక్ష్మణ్...
న్యాయమూర్తుల పనిఒత్తిడి గురించి హైకోర్టు జస్టిస్ కె. లక్ష్మణ్ చె బుతూ జస్టిస్ నరసింహ, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ మధ్య జరి గిన ఓ సరదా సంభాషణను సభికులతో పంచుకున్నారు. తనకు నిద్రలోనూ వాదనలు వింటున్నట్లు కలలు వస్తున్నాయని జస్టిస్ శ్రవణ్‌కుమార్ పేర్కొనగా తనకైతే ఇంకా న్యాయవాదిగా వాదన లు వినిపిస్తున్నట్లే కలలు వస్తున్నాయని జస్టిస్ నరసింహ బదులి చ్చారన్నారు. దీంతో సదస్సుకు హాజరైన వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగారు.
సుప్రీంకోర్టు జడ్జీలంతా నిత్యం ఉదయం 10 గంటలకు టీ తాగేందుకు కలుస్తారని.. హైకోర్టు జడ్జీలందరం వా రంలో ఏదో ఒకరోజు కలుస్తామని జస్టిస్ లక్ష్మణ్ చెప్పారు. జిల్లా జడ్జీలు సైతం అప్పుడప్పుడూ కలుసుకోవాలని.. వృత్తిపరమైన అంశాలతోపాటు ఇతర అంశాలపైనా పరస్పరం అభిప్రాయాలను పంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో హైకోర్టు న్యాయ మూర్తులతోపాటు న్యాయ శాఖ కార్యదర్శి ఆర్.తిరుపతి, తెలంగాణ న్యాయ మూర్తుల సంఘం అధ్యక్షుడు కె.ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె. మురళీమోహన్, తెలంగాణ జడ్జీల మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బి. పాపిరెడ్డి, కార్యదర్శి సి. విక్రమ్, జిల్లా జడ్జీలు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
పంచె కట్టులో వచ్చిన జస్టిస్ నరసింహ..
సాధారణంగా న్యాయమూర్తులంతా సూటుబూటులోనే ఎక్కువ గా కనిపిస్తారు. కానీ తెలంగాణవాసి అయిన జస్టిస్ పీఎస్ నర సింహ మాత్రం తెలుగుదనం ఉట్టిపడేలా గోధుమ రంగు లాల్చీ, పంచెకట్టులో విచ్చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా, స్వప్నిక అనే దివ్యాంగురాలు (చేతులు లేని) తన నోటి సాయంతో గీసిన జస్టిస్ పీఎస్ నరసింహ చిత్రాన్ని ఈ సదస్సులో ఆయనకు అందజేసింది.