
ఉస్మానియా ఆస్పత్రిలో పాప
రఘునాథపల్లి: తలలో కణితితో జన్మించిన ఆడశిశువుకు ఆపరేషన్ చేసి ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆ కణితిని తొలగించారు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన మూడు రోజుల ఆడశిశువును.. ఎవరో ఈ నెల 28న జనగామ జిల్లా రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలో వదిలేశారు. బాలల సంరక్షణ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మంగళవారం వైద్యులు ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. కాగా, చిన్నారికి గుండెలోనూ సమస్య ఉందని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరస్వతి తెలిపారు.