
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌పై విద్యార్థుల అనాసక్తి
ఫీజులు అధికంగా ఉన్నాయంటున్న తల్లిదండ్రులు
రూ.40 వేల నుంచి రూ. 1,60,000 వరకు ఫీజులు
200 సీట్లలో నిండినవి 87 మాత్రమే
ఫీజులపై అధికారుల పునరాలోచన
సాక్షి, హైదరాబాద్: పోలీసుల పిల్లల కోసం ప్రభుత్వం మంచిరేవులలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్)లో అడ్మిషన్లు నత్తనడకన సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలు, విద్యతోపాటు ఆటలు, ఇతర కోకరికులర్ యాక్టివిటీలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నా.. పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపటం లేదు.
ఈ స్కూల్‌లో పోలీసుల పిల్లలకు 100 సీట్లు, సాధారణ పౌరుల పిల్లలకు 100 సీట్ల చొప్పున మొత్తం 200 సీట్లతో ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటివరకు పోలీసుల పిల్లలు 82 మంది, సాధారణ పౌరుల పిల్లలు ఐదుగురు మాత్రమే చేరారు.
ప్రభుత్వ జీవోకే తూట్లు
ఈ స్కూల్‌లో పోలీసుల పిల్లలకు వారి తల్లిదండ్రుల ర్యాంకు ఆధారంగా ఫీజులు నిర్ణయించారు. అమరవీరుల పిల్లలకు ఏడాదికి రూ.40 వేలు, హోంగార్డు నుంచి ఏఎస్సై స్థాయి వరకు రూ.50 వేలు, ఎస్సై నుంచి డీఎస్పీ వరకు రూ.95 వేలు, ఎస్పీ ఆపై ర్యాంకు అధికారుల పిల్లలకు రూ.1.4 లక్షల ఫీజు ఉంది. సాధారణ పౌరుల పిల్లలకు ఏడాదికి రూ.1.6 లక్షలుగా ఫీజు నిర్ణయించారు. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు ఉండడంతో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.
సాధారణ పౌరుల పిల్లల కోటాలో ఇప్పటివరకు ఐదు సీట్లు మాత్రమే భర్తీ కావడమే ఇందుకు నిదర్శనం. ఈ స్కూల్‌లో అడ్మిషన్ ఫీజు రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. 2009లో ప్రభుత్వం జారీచేసిన జీవో 91 ప్రకారం అడ్మిషన్ ఫీజు రూ.5 వేలు మించరాదు. ఈ జీవో ఏ ప్రైవేటు పాఠశాలలోనూ అమలు కావడం లేదనే విమర్శలున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన వైఐపీఎస్‌లోనూ ఆ జీవోను తుంగలో తొక్కటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా మ్యాజిక్ బాక్స్ పేరిట విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, ఇతర స్టేషనరీ వస్తువులు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించడం కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొంటున్నారు.
అడ్మిషన్లు పూర్తికాకపోవటంతో అధిక ఫీజులపై స్కూల్ నిర్వాహకులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. స్కూల్ ప్రారంబోత్సవం సమయంలోనే ఫీజుల తగ్గింపుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించటం గమనార్హం.