మీడియాపై 'ఫైబర్‌' కంట్రోల్‌ | Ap Govt planning impliment Fiber control on Media | Sakshi

మీడియాపై 'ఫైబర్‌' కంట్రోల్‌

Published Mon, Jan 1 2018 8:19 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

Ap Govt planning impliment Fiber control on Media - Sakshi

సాక్షి, అమరావతి
ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ వద్దు మొర్రో అంటున్నా ప్రభుత్వం ప్రజల వెంట ఎందుకు పడుతోంది? కనెక్షన్లు బదలాయించాల్సిందేనని ఆపరేటర్లు, ఎంఎస్‌వోలపై ఎందుకు ఒత్తిడి చేస్తోంది? సహకరించకపోతే ఉన్న కనెక్షన్లు కట్‌ చేస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేయాల్సిన అవసరం ఏమిటి? మీడియాపై ఆధిపత్యానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ప్రజా వ్యతిరేకత జనంలోకి వెళ్ళకుండా కొన్ని ఛానల్స్‌ను కట్టడి చేసే కుట్ర చేస్తోందా? ఫైబర్‌నెట్‌ విషయంలో సర్కార్‌ వేస్తున్న అడుగులు చూస్తే ఇవన్నీ నిజమే అన్పిస్తోంది. అమరావతిలో ఏర్పాటు చేసే కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్నిచోట్ల కేబుల్‌ ప్రసారాలను నియంత్రించవచ్చట. అంటే కేబుల్‌ ప్రసారాలు పూర్తిగా ప్రభుత్వ గుప్పిట్లోకి వెళ్లిపోతాయన్నమాట. వద్దనుకున్న చోట వద్దనుకున్న చానెల్‌ను అనుకున్న సమయం వరకు ఆపగలిగే శక్తి ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. ఇక ప్రభుత్వం చెబుతున్న నెట్, కేబుల్, ఫోన్‌ మూడు సదుపాయాలూ అరకొరగా మాత్రమే అందుతాయని, వాటి కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్న విషయం ప్రజలకు అర్ధమయ్యింది. అందుకే ఫైబర్‌ నెట్‌పై ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదని వినిపిస్తోంది.

అధికారులను ప్రయోగించి ఒత్తిళ్లు..
గత ఏడాది మార్చి 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) ఏర్పాటు  సందర్భంగా ఓ ప్రకటన చేశారు. అడిగిన వాళ్ళకు మాత్రమే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఇస్తామన్నారు. ఎవరినీ ఒత్తిడి చేయబోమన్నారు. నెట్, కేబుల్, ఫోన్‌... మూడూ అతి తక్కువ ధరకు ప్రజలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. కేబుల్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోల మీద ప్రభుత్వాధికారులే ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా కేబుల్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలుగా అధికార పార్టీ వాళ్ళే ఉన్నారు. ఫైబర్‌ నెట్‌ కావాలని ప్రజలు అడిగితే ఇవ్వడానికి వాళ్ళు ఏమాత్రం సంకోచించరు. జనం ఆసక్తి చూపించడం లేదు కాబట్టే రకరకాల ఎత్తులు వేస్తున్నారు.

అంతా ఒక ‘పథకం’ ప్రకారమే..
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటువ్యక్తులకు తెగనమ్మిన చరిత్ర ఉన్న చంద్రబాబు ... కేబుల్‌ వ్యాపారంలోకి ప్రభుత్వాన్ని ఎందుకు చొప్పిస్తున్నారనేది అర్ధం చేసుకోలేనంత బ్రహ్మపదార్ధమేమీ కాదు. నాలుగేళ్ళ పాలనలో ప్రజలకిచ్చిన హామీలేవీ నెరవేర్చలేకపోయారు. మరో పక్క అన్ని రంగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వ అనుకూల మీడియా ఎంత వెనకేసుకొచ్చినా... కొన్ని ఛానల్స్‌ ప్రసారం చేసే వాస్తవాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. అంతిమంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత చంద్రబాబు సర్కారుకు నిద్ర పట్టనివ్వడం లేదు. వ్యతిరేక మాధ్యమాల గొంతు నొక్కేందుకే ఫైబర్‌నెట్‌ ప్రయత్నం మొదలుపెట్టారు. ఫైబర్‌ నెట్‌ ద్వారా కేబుల్‌ ప్రసారాలను గుప్పిట్లో పెట్టుకోవడం, తనకు అనుకూలంగా లేని మీడియాను అదుపు చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలుస్తోంది.

కేంద్ర కార్యాలయం నుంచి నియంత్రణ..
కేబుల్‌ ప్రసారాలు సాధారణంగా ప్రభుత్వ అజమాయిషీలో ఉండవు. అయితే ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రసారాలను అదుపు చేసే వీలుంటుంది. ప్రభుత్వం కొత్తగా వేయించిన ఫైబర్‌నెట్‌ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఆధీనంలో ఉంటుంది. ఓపీఇఎన్‌ (ఆప్టికల్‌ ప్రిమిసెస్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌), ఐపీటీవీ (ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెలివిజన్‌) బాక్సులు ఫైబర్‌నెట్‌ సర్వర్లకు లింక్‌ అయి ఉంటాయి. అవసరం అనుకున్నప్పుడు ఏదైనా ఛానల్‌ ప్రసారాలను కేంద్ర కార్యాలయం నుంచే నియంత్రించే వ్యవస్థ ఇందులో ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా, విపక్ష నేతలు ఎవరైనా మాట్లాడుతున్నా అప్పటికప్పుడే దాన్ని అమరావతిలో ఏర్పాటు చేసిన కేంద్ర కార్యాలయం నుంచి నిలువరించవచ్చు. దీనికోసమే ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ విస్తరణకు ఈ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచి, నెట్, కేబుల్, టెలిఫోన్‌ మూడూ కలిపి తక్కువకే ఇస్తున్నామని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ప్రజలెందుకు ఇష్టపడటం లేదంటే..
ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ... ఈ మూడింటికి నెలకు రూ.149 చెల్లిస్తే సరిపోతుందని సర్కారు చెబుతున్నా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగానే ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి, బలవంతంగా అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఫైబర్‌నెట్‌ను నిశితంగా పరిశీలిస్తే... దీని ద్వారా వచ్చే ప్రసారాలలో కొన్ని పెయిడ్‌ ఛానల్స్‌ ఉండవు. ఈ ఛానళ్ళను ప్రత్యేక ప్యాకేజీ కింద కొనుగోలు చేయాలి. దీనికి అదనంగా మరో రూ. 180 అవుతుంది. ఇప్పుడు కేబుల్‌ ఆపరేటర్లు రూ.150లకే పెయిడ్‌ ఛానళ్ళు కూడా ఇస్తున్నారు. ఇంటర్నెట్‌ విషయానికొస్తే గృహావసరాలకు 15 ఎంబీపీఎస్‌ వేగంతో నెలకు 5 జీబీ మాత్రమే ఇస్తారు. ఇది దాటితే స్పీడ్‌ తగ్గుతుంది. వాస్తవానికి 5 జీబీ పరిమితి కేవలం మూడు వీడియోలు చూస్తే ఖర్చయిపోతుంది. కాబట్టి దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ విషయానికొస్తే ఫైబర్‌నెట్‌ వినియోగదారుల మధ్య మాత్రమే ఉచిత కాల్స్‌ ఉంటాయి. ఇతర నెట్‌వర్క్‌కు ఫోన్‌చేస్తే.... ల్యాండ్‌లైన్‌కు అయితే నిమిషానికి 50 పైసలు, సెల్‌కు అయితే రూపాయి చెల్లించాలి. ప్రై వేటు మొబైల్‌ ఆపరేటర్లు ఇంతకన్నా తక్కువకే ప్యాకేజీలు అందిస్తున్నారు. అందువల్ల ఫైబర్‌నెట్‌ శుద్ధ దండగమారి స్కీమ్‌ అని జనం నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఆది నుంచి ఎన్నో ఆరోపణలు..
ఫైబర్‌నెట్‌ పథకంపై ఎన్ని ఆరోపణలొచ్చినా సర్కారు వెనక్కు తగ్గలేదు. గతంలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన టెరాసాఫ్ట్‌ అనే సంస్థకు ఫైబర్‌ కేబుల్‌ వేసే కాంట్రాక్టును అప్పగించింది. చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఫైబర్‌నెట్‌ సంస్థలోనూ డైరెక్టర్‌గా ఉన్నారు. సెట్‌టాప్‌ బాక్సుల వ్యవహారం కూడా గందరగోళంగానే ఉంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే బాక్సుల కాంట్రాక్టును నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుకూల సంస్థలకు కట్టబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. నాణ్యత లేని సెట్‌టాప్‌ బాక్సులను తరలిస్తుండగా చెన్నైలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కేంద్రం వద్ద సాగిలపడాల్సి వచ్చింది. సెట్‌టాప్‌ బాక్స్‌ల ధరపై కూడా రకరరాల విమర్శలున్నాయి. ఒక్కో బాక్సు రూ. 4 వేల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల కనెక్షన్లకు అవసరమైన సెట్‌టాప్‌ బాక్సులకు పథక రచన చేయడం వెనుక కోట్లాది రూపాయల కుంభకోణం ఉందనే ఆరోపణలున్నాయి. ట్రాయ్‌ రూల్స్‌ ప్రకారం ప్రతీ కేబుల్‌ వినియోగదారుడు ఈ ఏడాది జనవరి 31 నాటికే సెట్‌టాప్‌ బాక్సులు అమర్చుకున్నారు. వీటిని ఒక్కొక్కటీ రూ. 2 వేలు వెచ్చించి కొన్నారు. వీటిల్లో కొన్ని మార్పులు చేసినా ఫైబర్‌ నెట్‌ వాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయినా ఆ బాక్సులను పక్కన పారేసి కొత్త బాక్సులు కొనాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇలా అయినవారికి కోట్లు పంచిపెట్టి వాటాలు దండుకోవడమే కాకుండా, మీడియాను అరచేతిలో పెట్టుకునేందుకు ప్రభుత్వం పథకం పన్నడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement