
'తప్పు చేస్తే.. తొలగిస్తా'
హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా, అక్రమాలకు పాల్పడినా నిర్ధాక్షిణంగా తొలగిస్తామని అధికారులు, ఏజెన్సీలను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
అనంతపురం : హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా, అక్రమాలకు పాల్పడినా నిర్ధాక్షిణంగా తొలగిస్తామని అధికారులు, ఏజెన్సీలను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ హాలులో నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.... గత కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పథకాన్ని ధనయజ్ఞం మార్చిందని మండిపడ్డారు.
ఇష్టారాజ్యంగా పనులు చేసి అందినకాడికి నిధులు దండుకున్నారని ఆరోపించారు. గతంలో చేసిన ఆ తప్పులను సరిదిద్దుకునే రోజులు వచ్చాయని దేవినేని ఉమా ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. గత ఏడాది 16.5 టీఎంసీలు హంద్రీనీవాకు వస్తే రైతుల కళ్ళల్లో ఆనందం చూశామన్నారు. వచ్చే ఏడాది 40 టీఎంసీలు తీసుకువస్తే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక జేఈ, డీఈలు ఉన్నారని యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
పసులు చేపట్టడంలో రియాల్టీ ఉండేందుకు ఎప్పటికప్పుడు వీడియోలు తీయాలన్నారు. చరిత్రలో స్థానం కావాలంటే పనులను పరుగులు పెట్టించాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కాలువపై పర్యటిస్తారని, ఎప్పుడు, ఎక్కడికి ఆయన వస్తారో చెప్పరని... కానీ అధికారులంతా జాగ్రత్తగా పనులు చేపట్టాలన్నారు. పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణాలోకి నీళ్ళు మల్లించి అక్కడి నుంచి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ జిల్లాలకు దాదాపు 60 టీఎంసీలు తీసుకొస్తామని అన్నారు.
పనులలో చేపట్టడంలో ఏమైనా అక్రమాలు జరిగితే ఫోన్ చేయాలని, లేకున్నా మేసేజ్ చేసినా చాలని లష్కర్ నుంచి ఇంజనీర్ల వరకూ ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎవరికి కేటాయించిన ప్యాకేజీలను వారు రోల్‌మాడల్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. ఉద్యోగులకు పనితీరే కొలబద్ద అని, బాగా పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. పదవీవిరమణ చెందిన ఇంజనీర్ల సేవలు కూడా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ... కరువు జిల్లా అనంత ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న మంత్రి దేవినేని ఉమాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ మాట్లాడుతూ... హంద్రీనీవాను చాలెంజ్‌గా తీసుకొని పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే మూడు సార్లు కాలువగట్టుపై ప్రయాణించారని ఈ సందర్భంగా ఆయన మంత్రిని ప్రశంసించారు. డిసెంబర్ నాటికి అన్ని చెరువులకు నీటిని నింపాలని కోరారు. ఇందుకోసం తమ సంపూర్ణ సహకారం అందిస్తామని చమన్ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, అనంతపురం సీఈ జలందర్, తిరుపతి సీఈ సుదాకర్, ఎస్‌ఈలు సుధాకర్‌బాబు, మురళీనాథ్‌రెడ్డి, హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావు, చిన్ననీటిపారుదలశాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, హంద్రీనీవా, హెచ్చెల్సీ, చిన్ననీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.