అనంతపురం జిల్లాలో అప్పుల బాధ తాళలేక, తీర్చే మార్గం తోయకపోవడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అనంతపురం (కళ్యాణదుర్గం) : అనంతపురం జిల్లాలో అప్పుల బాధ తాళలేక, తీర్చే మార్గం తోయకపోవడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లి గ్రామ రైతు బోయ వీరన్న(55) కు 3.5 ఎకరాల పొలం ఉంది. కుటుంబ పోషణకు, పంటల సాగుకు వీరన్న రూ. 5.60లక్షల వరకు అప్పులు చేశాడు. తండ్రి పేరుతో ఉన్న పొలంపై వేపులపర్తి ఆంధ్రబ్యాంకులో లక్ష రూపాయల అప్పు ఉంది.
పొలంలో మూడు బోర్లు వేయగా ఒక బోరులో అరకొరగా నీరు లభించాయి. దీని ఆధారంగా 3 ఎకరాల తోటలో ఉల్లి పంట సాగు చేయగా నీరు తగ్గి పంట ఎండి పోయింది. మరో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని రూ. లక్ష పెట్టుబడి పెట్టి నెల క్రితం వేరుశనగ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట కూడా ఎండుముఖం పట్టింది. దీంతో కుంగిపోయిన ఈరన్న సోమవారం తోటలోకి వెళ్ళి తాడుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.