
తెలంగాణ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
సాక్షి, కర్నూలు : శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్‌కు శుక్రవారం నీరు విడుదలైంది. తెలంగాణ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దాంతో 1.06 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌లోకి చేరుతోంది. అంతకుముందు మంత్రులు అనిల్‌కుమార్, నిరంజన్‌రెడ్డి కృష్ణమ్మకు జలపూజ చేశారు. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు సందర్శకులు భారీ ఎత్తున తరలివచ్చారు.
ముఖ్యమంత్రుల సఖ్యతతోనే సాధ్యం..
నీటి విడుదల అనంతరం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పండుగ వాతావరణంలో శ్రీశైలం డ్యామ్ నుంచి నీరు విడుదల చేసుకున్నాం. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే శ్రీశైలం నుంచి సాగర్కు నీరు విడుదల చేయడం సంతోషంగా ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో, జలదౌత్యంతో వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. గోదావరి నీటిని కృష్ణాలో కలిపేందుకు కేసీఆర్, జగన్ ప్రయత్నిస్తున్నారు. జగన్ ఆహ్వానం మేరకు తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలం వచ్చాం’అన్నారు.
గతంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు ఉండేవని కేసీఆర్ జల దౌత్యంతో సమస్యలు తీరుతున్నాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. జగన్, కేసీఆర్ ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్వేషాలు సృష్టించి కొంతమంది నాయకులు పబ్బం గడుపుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్ స్నేహాభావంతో మెలిగి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారుని అన్నారు.