సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సంఘాలు చేపట్టిన సమ్మెతోనే ఉద్యమం ఉద్ధృతమైందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సంఘాలు చేపట్టిన సమ్మెతోనే ఉద్యమం ఉద్ధృతమైందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమానికి శనివారం వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సమ్మె కాలానికి జీతాలు రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని అలా చేయలేకపోతున్నందున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారని వివరించారు. రాయలసీమలో కనీసం వెయ్యి మందికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటి లేదని, సమన్యాయం చేయకుండా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం గర్హనీయమన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యోగులతో కలిసి వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని, అవసరమైతే ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాష్ట్ర విభజనను అడ్డుకోక పోతే భావితరాలు క్షమించవని హెచ్చరించారు, పదవులను వదులుకొని మీరే ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే మేము వెనుక ఉండి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. సమైక్య ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో సమైక్యాంధ్ర కోసం లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు.