రాజకీయంగా తమకు అడ్డు వస్తున్నాడన్న కారణంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీకి చెందిన ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి
కేఏ మల్లవరం(కోటనందూరు) : రాజకీయంగా తమకు అడ్డు వస్తున్నాడన్న కారణంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీకి చెందిన ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మల్లవరం గ్రామానికి చెందిన చెందిన ఎమ్మిలి సత్యనారాయణను అదే గ్రామానికి చెందిన పొడుగు చినఎరకయ్య కత్తితో దాడి చేశాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయం చూసి సోమవారం అర్ధరాత్రి దాటాక మూడు గంటల ప్రాంతంలో సత్యనారాయణపై ఎరకయ్య కత్తితో దాడి చేసి ముఖంపై నరికాడు.
దీంతో కంటి కింద భాగం నుండి మెడ వరకూ గాయమై తీవ్ర రక్త స్రావంతో కుప్పకూలాడు. స్థానికుల సహయంతో మంగళవారం తెల్లవారు జామున తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సత్యనారాయణ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుడికి కుమారులు ప్రసాద్, నాని, కుమార్తె కుమారి ఉన్నారు. అయితే సత్యనారాయణను నరికింది తానేనని, తనకు మతి స్థిమితం లేక ఏమి చేస్తున్నానో తెలియలేదని హత్యాయత్నానికి పాల్పడిన చిన ఎరకయ్య చెబుతుండడం గమనార్హం. అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై గోపాలకృష్ణ వివరించారు.
బాధితుడు ఎమ్మిలి సత్యనారాయణ వైఎస్సార్ పార్టీ తరఫున దళిత సామాజిక వర్గంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. రాజకీయ కక్ష సాధింపు చర్యగా, అదే గ్రామానికి చెందిన షెడ్యుల్ తెగలకు చెందిన చినఎరకయ్యతో హత్యాయత్నానికి టీడీపీ నేతలు ప్రయత్నించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. అధికార పార్టీ అండ చూసుకుని కింది స్థాయి కార్యకర్తలు పాల్పడుతున్న అరాచకాలకు ఇది పరాకాష్ట అని స్థానికులు మండిపడుతున్నారు. సత్య నారాయణపై జరిగిన దాడి అనైతికమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ఇటువంటి దాడులను ప్రోత్స హించడం మంచిది కాదన్నారు. త్వరగా కోలుకోవాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.