శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో బుధవారం సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి మొదలైంది.
శ్రీశైలం: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో బుధవారం సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలన్న కృష్ణాబోర్డు ఆదేశాల మేరకు జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లోలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మంగళవారం రాత్రి ట్రయల్ రన్ కింద కొద్ది మేర విద్యుత్ ఉత్పత్తి చేశారు. 27 క్యూసెక్కులను వినియోగించుకుని 0.013 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. బుధవారం సాయంత్రం నుంచి కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్ 100 మెగావాట్ల సామర్థ్యం చొప్పున ఉత్పాదన చేస్తున్నారు.
దిగువన నాగార్జునసాగర్‌కు 4,980 క్యూసెక్కులు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 130 మెగావాట్ల సామర్థ్యం చొప్పున ఒక జనరేటర్ విద్యుత్ ఉత్పాదన చేస్తూ 7,063 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరీవాహకప్రాంతాలైన జూరాల, తుంగభద్ర, హంద్రీల నుంచి 47,075 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 55.4618 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 835.30 అడుగులకు చేరుకుంది.