
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ధులే జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. రసాయన కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది చనిపోగా 65 మంది గాయపడ్డారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. శిరపూర్ సిటీ పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ సంజయ్ ఆహీర్ తెలిపిన వివరాల మేరకు.. శిరపూర్ సమీపంలోని వాఘాడీ గ్రామ సమీపంలో ఉన్న రుమిత్ కెమికల్ కంపెనీలో శనివారం ఉదయం సుమారు 9.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
పెద్దఎత్తున మంటలు కూడా వ్యాపించాయి. పేలుడు తీవ్రతకు కంపెనీ ఆవరణలోని రేకుల షెడ్లు, పైకప్పు కూలిపోయాయి. దీంతో అనేక మంది కార్మికులు శిథిలాల కింద కూరుకుపోయారు. మంటల తీవ్రతకు కంపెనీ పరిసరాల్లో పార్కింగ్ చేసిన వాహనాలతోపాటు చెట్లు కూడా మంటలకు కాలిపోయాయి. ఈ ఘటనలో 13 మంది చనిపోగా 65 మంది గాయాలపాలయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. ముందు జాగ్రత్తగా పరిసరప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు.