
న్యూఢిల్లీ: ‘ఎయిర్‌సెల్– మాక్సిస్’కేసులో సీబీఐ కావాలనే తనపై మీడియాకు లీకులిస్తూ న్యాయవ్యవస్థను ఎగతాళి చేస్తోందని కాంగ్రెస్ సీనియర్‌నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాదులు పీకే దుబే, అర్షదీప్ సింగ్‌లు వేసిన వ్యాజ్యాన్ని ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ షైని మంగళవారం విచారించారు.
ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో చిదంబరంపై కోర్టు విచారణ జరిపేందుకు సీబీఐకి ఆసక్తి లేదని, మీడియానే విచారణ జరిపేందుకు తన పిటిషనర్‌పై ఉద్దేశపూర్వకంగా లీకులు అందజేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ ఇంతవరకూ చార్జిషీటును కూడా కోర్టుకు అందివ్వలేదని, ఆ కాపీని తమకు అనుకూలమైన మీడియాకు అందజేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.