
సాక్షి, చెన్నై: తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి కంచి పీఠాధిపతి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమవడంతో జయేంద్ర సరస్వతి బుధవారం శివైక్యం చెందినట్లు సమాచారం.
కాగా, గత నెలలోనూ శ్వాసకోశ ఇబ్బందులతో అస్వస్థతకు గురైన జయేంద్ర సరస్వతిని చెన్నై పోరూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కంచి పీఠాధిపతి కోలుకున్న విషయం తెలిసిందే.
జయేంద్ర సరస్వతి 1935 జూలై 18న తంజావూరు జిల్లాలోని ఇరుల్ నీకిలో జన్మించారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ. 1954 మార్చి 22న కంచి పీఠంలో చేరిన ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి పీఠానికి ఆయన 69వ పీఠాధిపతిగా సేవలు అందించారు.