‘వో కహతే హై మోదీ హఠావో, మై కహతా హు కాలే ధన్ హఠావో’ సోమవారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నమాటలివి.
న్యూఢిల్లీ: ‘వో కహతే హై మోదీ హఠావో, మై కహతా హు కాలే ధన్ హఠావో’ సోమవారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నమాటలివి. ‘వో కహతే హై ఇందిరా హఠావో, మై కహతీ హు గరీబీ హఠావో’ అని 1971లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అన్నమాటలివి. నేడు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలపై మోదీ ఈ వ్యాఖ్యలు చేయగా, నాడు తమళనాడు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా (0–ఆర్గనైజేషన్) నాయకుడు కే. కామరాజ్ చేసిన విమర్శలపై ఇందిరా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
నాడు ఇందిరాగాంధీ చేసిన వ్యాఖ్యలనే నేడు నరేంద్ర మోదీ ఉచ్ఛరించడమే కాకుండా జాగ్రత్తగా గమనిస్తే ఆమె తరహాలోనే పరిపాలన సాగిస్తున్నారు. ఇందిర హయాంలో ప్రధాన మంత్రి పీఠమే అ«ధికార కేంద్రంగా పరిపాలన సాగగా, నేడు మోదీ హయాంలో కూడా అదే కొనసాగుతోంది. నాడు ప్రజాప్రతినిధులకన్నా అధికారులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండగా, మోదీ హయాంలో అదే కొనసాగుతోంది. ఇందిర హయాంలో తోటి మంత్రులకాన్న పీఎన్ హక్సర్, పీఎన్ ధర్, పీసీ అలెగ్జాండర్‌లే ఎక్కువ అధికారాలు చెలాయించారు.
నాడు కశ్మీర్ నుంచి నేడు గుజరాత్ నుంచి....
నాడు అధికారుల సలహా మేరకే ఇందిరాగాంధీ 1969లో ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణకు చొరవ తీసుకుంటే నేడు నరేంద్ర మోదీ తోటి మంత్రులకు కూడా చెప్పకుండా గుజరాత్‌కు చెందిన హాస్ముఖ్ అధియా లాంటి అధికారుల సలహా మేరకు పెద్ద నోట్లను రద్దు చేశారు. నాడు ఇందిర కశ్మీరుకు చెందిన అధికారులనే ఎక్కువగా తన కొలువులో పెట్టుకోగా, నేడు గుజరాత్‌కు చెందిన అధికారులనే కేంద్ర క్యాడర్‌లోని ముఖ్యమైన పోస్టులకు తెచ్చుకుంటున్నారు.
సమాఖ్య పాలన విస్మరణ....
ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన సమాఖ్య పాలనకు నాడు ఇందిరాగాంధీ చరమగీతం పాడగా, నేడు మోదీ కూడా అదే బాట అనుసరిస్తున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు కేంద్రం చెప్పుచేతుల్లో ఉండేలా చూసుకోవడం. అందుకు కీలుబొమ్మ ముఖ్యమంత్రులను నియమించడం పరిపాటి. 1978 నుంచి 1983 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుగురు ముఖ్యమంత్రులను చూసింది. నాడు పాత వారిని తొలిగించడం, వారి స్థానంలో కొత్త వారిని నియమించడంలో కీలక పాత్ర ఇందిరాగాంధీదే.
మోదీ కూడా ఆమె తరహాలోనే....
ఇప్పుడు గుజరాత్, గోవా ముఖ్యమంత్రులు డమ్మీలే. వారు మోదీ ఆశీస్సులతోనే సీఎంలు అయ్యారు. మహారాష్ట్ర, హర్యానాలో కూడా స్థానికంగా ప్రాబల్యంగల కులానికి చెందిన వారు కాకుండా తన మాట వినేవారినే సీఎం కుర్చీలో కూర్చునేలా మోదీ చేశారు. 1980లో మరాఠా లాబీని దెబ్బతీయడం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏఆర్ అంతులేను ఇందిరాగాంధీ సీఎం చేసినట్లుగా మోదీ కూడా నడుచుకున్నారు. అందుకే ఇప్పుడు మోదీ సోషల్ మీడియా ‘నరీంద్ర’ మోదీగా అభివర్ణిస్తోంది.
భవిష్యత్తు ఏమిటీ?
ఏకఛత్రాధిపత్య పాలన సాగిస్తూ ఉక్కు మహిళగా గుర్తింపు పొందిన ఇందిరా గాంధీ 1984లో హత్యకు గురవడంతో ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన సానుకూల పవనాలు వీచి కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 404 సీట్లు వచ్చాయి. వ్యక్తిగతంగా అంతటి గుర్తింపు తెచ్చుకోవాలని, విజయం సాధించాలని నరేంద్ర మోదీ కూడా అనుకున్నారేమో 2014 ఎన్నికల్లో అన్నీ తానై బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. నాడు ప్రైవేటు బ్యాంకుల జాతీయం, ‘గరీబీ హఠావో’ నినాదం ద్వారా నాడు(1971) ఎన్నికల్లో ఇందిరాగాంధీ పార్టీని గెలిపిస్తే స్తే నేడు ‘కాలా ధన్ హఠావో’ నినాదంతో మోదీ, రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని ఏం చేస్తారో!?