
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై పునరాలోచన చేయాలని, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకుగాను శనివారం కోల్‌కతా వచ్చిన మోదీతో రాజ్‌భవన్‌లో మమత సమావేశమయ్యారు. అనంతరం మమత నేరుగా టీఎంసీ చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొన్నారు. ప్రధాని వచ్చిన సమయంలో కోల్‌కతా విమానాశ్రయం వెలుపల, మార్గమధ్యంలోని ఫ్లై ఓవర్ వద్ద జాతీయ పతాకాలు, నల్ల జెండాలతో ఆందోళనకారులు సీఏఏ వ్యతిరేక నినాదాలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వామపక్ష సంఘాల కార్యకర్తలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనల నేపథ్యంలో నగరంలోని కీలకప్రాంతాల్లో పోలీసులను మోహరించారు.
సీఏఏ వెనక్కి తీసుకోవాలని కోరా
‘ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశం. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన రూ.28 వేల కోట్ల ఆర్థిక సాయం గురించి ప్రధానితో చర్చించాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల గురించి ఆయనకు తెలిపాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు మేం వ్యతిరేకమని చెప్పాను. ఈ విషయంలో కేంద్రం కూడా పునరాలోచన చేయాలని, సీఏఏను వెనక్కి తీసుకోవాలని కోరాను. సామాన్యులపై వివక్ష, వారిని వేరుగా చూడటం, వేధించ డం తగదని చెప్పా’ అని మమత అన్నారు. ‘ఢిల్లీకి వస్తే చర్చిద్దాం’ అని అన్నారని మమత చెప్పారు.
బేలూరు మఠంలో ప్రధాని బస
మోదీ శని, ఆదివారాల్లో జరిగే కోల్‌కతా పోర్ట్ 150వ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రధానితోపాటు గవర్నర్ ధన్‌కర్, సీఎం మమత ఒకే వేదికపై కనిపించనున్నారు. శనివారం రాత్రి ఆయన హౌరా జిల్లాలో ఉన్న రామకృష్ణ మిషన్ ప్రధానకార్యాలయం బేలూర్ మఠంలో బస చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, తదితర ప్రముఖులు ఎందరో ఈ మఠాన్ని గతంలో పలుమార్లు సందర్శించినప్పటికీ ఎవరూ కూడా అక్కడ బస చేయలేదని మఠం అధికారులు తెలిపారు.
మమతకు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన
ప్రధాని మోదీతో సీఎం మమతా బెనర్జీ సమావేశం కావడంపై వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చూస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం ధర్నా జరుగుతుండగా అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విరగ్గొట్టారు. మోదీతో భేటీపై మమతా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మోదీతో భేటీ.. ఆ వెంటనే ధర్నా..
ప్రధానితో సమావేశం అనంతరం సీఎం మమత నేరుగా అక్కడికి సమీపంలోనే టీఎంసీ విద్యార్థి విభాగం చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లారు. సీఏఏ అమలుపై హోం శాఖ జారీ చేసిన గెజిట్‌పై ఆ ధర్నాలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో సీఏఏ చట్టం కాగితాలపైనే ఉంటుంది. దీనిని అమలు చేసే ప్రసక్తే లేదు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు’అని తెలిపారు.