
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బుధవారం హైదరాబాద్ రానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ జరుపుతున్న సంప్రదింపుల్లో బాగంగా ఆయన ఇక్కడికి వస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానం లో అఖిలేశ్ హైదరాబాద్‌కు చేరుకుంటారు.
బేగంపేట ఎయిర్ పోర్టులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి అఖిలేశ్ ప్రగతి భవన్‌కు చేరుకొని కేసీఆర్‌తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరుపనున్నారు. సీఎం నివాసంలోనే అఖిలేశ్ మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత కూడా కేసీఆర్, అఖిలేశ్ భేటీ కొనసాగుతుంది. అనంతరం ఆయన మారేడ్‌పల్లిలో మంత్రి తలసాని ఇంట్లో తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం లక్నోకు తిరుగు పయనమవుతారు.