
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల, శీతాకాల సమావేశాలు నవంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. వచ్చే నెల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగే 63వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుపై చర్చించడానికి మంగళవారం పార్లమెంటు అనెక్స్ హాల్లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో మిగిలిపోయిన రిజర్వు క్యాటగిరీ సీట్లను జనరల్ క్యాటగిరిలో భర్తీ చేయాలని జవదేకర్‌ను కోరినట్టు తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
నవంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు10 రోజులపాటు నిర్వహించే అవకాశం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉందన్నారు. అంతకుముందు ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కోడెల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.